తెలంగాణ కాంగ్రెస్ లో కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా చేసిన విమర్శలు ఇటు టి.కాంగ్రెస్ లో హాట్ టాపిక్ కాగా అటు కాంగ్రెస్ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారిందనే చెప్పాలి.
మాకు కాంగ్రెస్ పార్టీ అన్నా, గాంధీ కుటుంబం అన్నా అదే ప్రేమ, అంతే గౌరవం ఉందంటూనే ఇటు సుస్మిత రేవంత్ విషయంలో తగ్గేదెలా అన్నట్టుగా రెచ్చిపోతుంటే, ఇటు కొండా దంపతులు సుస్మిత వ్యాఖ్యలు తన వ్యక్తిగతం అంటూ మాటదాటేసే ప్రయత్నం చేస్తున్నారు.
తాజగా కొండా మురళి సైతం కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితులలోను వీడేది లేదని, తన కుమార్తె కామెంట్స్ తన వ్యక్తిగతమని, ఆ విషయంలో ఆమెను ప్రశ్నించే హక్కు తమకు లేదని, క్రమశిక్షణ కమిటీకి తాము చెప్పాల్సిందంతా చెప్పామని, గాంధీ కుటుంబం పై తమకు పూర్తి విశ్వాసం ఉందంటూ కొండా సురేఖ మంత్రి పదవి భారాన్ని గాంధీ కుటుంబం పైకి నెట్టారు మురళి.
అయితే సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలను కనీసం ఖండించడానికి కూడా ముందుకు రాని కొండా సురేఖ, మురళి గాంధీ కుటుంబం పై తనకు విశ్వాసం ఉందంటూ వివాదాన్ని సోనియా కోర్ట్ లో వేశారు. అయితే కాంగ్రెస్ పార్టీని పదేళ్ల తరువాత రాష్ట్రంలో అధికారంలోకి తెచ్చిన రేవంత్ ని కాదని గాంధీ కుటుంబం సురేఖ ను కాపు కాస్తుందా.?
ఒకపక్క బీసీ కార్డు ప్రయోగంతో మరోపక్క గాంధీ కుటుంబం పై విశ్వాసం అనే సెంటిమెంట్ మంత్రం తో కొండా కుటుంబం సురేఖ మంత్రి పదవిని కాపాడుకునేందుకు తంటాలు పడుతున్నారు తప్ప సీఎం రేవంత్ రెడ్డి తో భేటీ అయ్యి వివాదాన్ని నాలుగు గోడల మధ్య ముగించేందుకు మాత్రం సుముఖత వ్యక్తం చేయడం లేదు.
దీనితో కొండా మురళి, కొండా సురేఖ ఇలా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ తమ కుమార్తె ను మరో పార్టీలోకి పంపాలనుకుంటున్నారని, అదే కొండా పొలిటికల్ ప్లాన్ – బి అంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. మరి కాంగ్రెస్ అధిష్టానం క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన సిఫారసులను ఆచరణలో పెడుతుందా.? లేదా అధిష్టానం కూడా తమ వద్ద ప్లాన్ – బి ఉందంటూ మరో కొత్త క్లైమాక్స్ తో ముందుకొస్తుందా.?





