మద్యం రవాణా కుంభకోణం కేసులో ఈడీ అధికారులు మాజీ మంత్రి కారుమూరు నాగేశ్వరరావుని అరెస్ట్ చేసి చంచల్ గూడా జైలుకి పంపారు.
ఆయన అరెస్టుపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ, “యాదవ్ కులానికి చెందిన కారుమూరు నాగేశ్వరరావుని, ఆయన కొడుకు సునీల్‌పై సిఎం చంద్రబాబు నాయుడు తప్పుడు కేసు పెట్టించి అరెస్ట్ చేయించారు. వాస్తవానికి జిల్లా స్థాయిలో మద్యం రవాణా కాంట్రాక్టు విలువ చాలా తక్కువ. అంత చిన్నదానిలో ఏదో అవినీతి జరిగిపోయిందంటూ తప్పుడు కేసు పెట్టి తండ్రీ కొడుకులను అరెస్ట్ చేయించారు,” అని జగన్మోహన్ రెడ్డి అన్నారు.
ఇదివరకు జగన్ పల్నాడు పర్యటనకు వెళ్ళినప్పుడు వైసీపీ శ్రేణులు “రప్పా రప్పా గొర్రె పొట్టేళ్ళలా తలకాయలు నరికినట్లు నరికేస్తాం,” అని జగన్ ఫోటోతో ఫ్లెక్సీ బ్యానర్లు వేసినప్పుడు అందరూ తప్పు పట్టారు.
కానీ జగన్ ప్రెస్‌మీట్ పెట్టి “చిన్న పిలోళ్ళు ఏదో సరదాకి రప్పా రప్పా అంటూ డైలాగ్స్ చెప్పినా తప్పేనా?” అంటూ వాళ్ళని సమర్ధించారే తప్ప తప్పని వారించలేదు. కనుక వాళ్ళు రెచ్చిపోయి కొన్ని జిల్లాలలో జగన్ ఫ్లెక్సీ బ్యానర్ ఎదుట నిజంగానే గొర్రె పొట్టేళ్ళని నరికి ఆ రక్తంతో అభిషేకం చేశారు.
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు పరామర్శించడానికి బయలుదేరిన జగన్మోహన్ రెడ్డి, మీడియాతో మాట్లాడుతూ “ఇది జస్ట్ ఓ చిన్న రోడ్ ప్రమాదం అంతే! దీనిలో ఓ 45 ఏళ్ళ వృద్ధుడు చనిపోతే అదో పెద్ద నేరమా? దానిని హత్యా నేరంగా కేసు నమోదు చేసి సీదిరి అప్పలరాజుని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు,” అని అన్నారు. అంటే 45 ఏళ్ళు దాటినవారు చచ్చినా పెద్ద సమస్యగా భావించరాదని చెప్తున్నారన్న మాట!
అయితే పోలీసులు సీదిరిని అందుకు అరెస్ట్ చేయలేదు. ఈ కేసు నుంచి కొడుకుని తప్పించడానికి సాక్ష్యాధారాలు మార్చినందుకు అరెస్ట్ చేశారనే విషయం జగన్‌కి తెలియదనుకోలేము.
ఇదివరకు వివేకానంద హత్య కేసులో కూడా ఇలాగే జరిగింది కదా? ఆయనను దుండగులు గొడ్డలితో దారుణంగా చంపేసిన తర్వాత, ఒంటి నిండా బ్యాండేలు చుట్టి గుండెపోటుతో చనిపోయారని నమ్మించే ప్రయత్నం చేసింది ఎవరు? అలా ఎందుకు చేశారు?
పోస్టుమార్టం నిర్వహించకుండా హడావుడిగా అంత్యక్రియలు చేయాలని ఎందుకు ప్రయత్నించారు? అంత పెద్ద వ్యక్తి సొంత బాబాయ్ దారుణ హత్యకు గురైతే, ఆ కేసు విచారణ ముందుకు సాగనీయకుండా అడ్డుపడింది ఎవరు? ఎందుకు?అనే ప్రశ్నలకు నేటికీ సమాధానాలు చెప్పనేలేదు.
ఇలా హత్య కేసు మొదలు ప్రతీ కేసుని లైట్ తీసుకోవాలన్నట్లు మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి, తన వైసీపీ నేతలు ఆ కేసులలో చిక్కుకొని అరెస్ట్ అయితే ‘అన్యాయం… అక్రమం ..’ అంటూ వాదించడం విచిత్రంగా అనిపిస్తుంది.





