నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న 100వ సినిమా “గౌతమీ పుత్ర శాతకర్ణి” పాటల విడుదల వేడుక సోమవారం సాయంత్రం తిరుపతిలోని నెహ్రూ మునిసిపల్ పాఠశాల మైదానంలో ఘనంగా జరుగనుంది. తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మతో పాటు పలువురు టీడీపీ నేతలు మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈ వేడుకకు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, సీఎం చంద్రబాబుతో పాటు హేమమాలిని సహా, చిత్ర నటీనటులందరూ రానున్నారని తెలుస్తోంది.
ప్రతిష్టాత్మక సినిమా కావడంతో నందమూరి అభిమానులు, టిడిపి కార్యకర్తలు ఈ ఆడియో వేడుక కోసం భారీ హంగామాకు సిద్ధమవుతున్నారు. తిరుపతిలో బాలకృష్ణ బస చేసే హోటల్ నుంచి 500 కార్లు, 1000 బైక్ లతో భారీ ర్యాలీ ఉంటుందని, ఈ ర్యాలీ సింహభాగంలో బాలకృష్ణ ఉంటారని అభిమాన సంఘాలు వెల్లడించాయి. ఎంట్రీ పాసులను వీ-వీఐపీలకు మాత్రమే ఇస్తున్నామని, సాధారణ అభిమానులు ఎంతమందైనా హాజరు కావచ్చని ఈవెంట్ నిర్వాహకులు తెలిపారు. నేటి సాయంత్రంతో వేదికకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తవుతాయని తెలిపారు.



