గోరంట్ల ఎపిసోడ్-2… ఈసారి క్లీన్ చిట్ ఎలా ఇస్తుందో?

Gorantla-Madhav-Kuruva-Another-Controversyవైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ నగ్నంగా మహిళకు వీడియో కాల్ (డర్టీ పిక్చర్) వ్యవహారంపై చాలా రోజులు సోషల్ మీడియాలో నలిగిన సంగతి తెలిసిందే. వందల కోట్లు ఖర్చు చేసి మన అగ్రహీరోలు చేసిన కొన్ని సినిమాలు కూడా అన్ని రోజులు థియేటర్లలో ఆడలేకపోయంటే అతిశయోక్తి కాదు. చివరికి అనంతపురం ఎస్పీ ఫకీరప్ప చేత ఆయనకు క్లీన్ చిట్ ఇప్పించుకోవలసి వచ్చింది. ఆ తర్వాత వేరే అంశాలపైకి మీడియా దృష్టి మళ్ళడంతో గోరంట్ల మాధవ్‌ డర్టీ పిక్చర్ క్రమంగా మరుగునపడింది. దాంతో తల బొప్పి కట్టినందున గోరంట్ల మాధవ్‌ మళ్ళీ ఎటువంటి వివాదాలలో చిక్కుకోకుండా జాగ్రత్త పడతారనుకొంటే మరో వివాదంలో చిక్కుకొన్నరిప్పుడు.

ఆయన ఎంపీగా గెలిచిన తర్వాత అనంతపురం పట్టణంలోని రాంనగర్‌ 80 ఫీట్ రోడ్డులో గల మల్లికార్జున రెడ్డి అనే వ్యక్తికి చెందిన ఓ రెండంతస్తుల ఇంటిని అద్దెకి తీసుకొని దిగారు. ఆరు నెలల తర్వాత ఖాళీ చేసేస్తానని ఇంటి యజమానికి ముందే చెప్పారు. ఆ ఇంట్లో దిగి మూడేళ్ళయినా నేటికీ గోరంట్ల మాధవ్‌ ఆ ఇంటిని ఖాళీ చేయలేదు. అద్దె చెల్లించడం లేదు. కనీసం కరెంట్ బిల్లులు కూడా చెల్లించడంలేదంటూ ఇంటి యజమాని మల్లికార్జున రెడ్డి వాపోతున్నారు. పెద్దమనుషులతో మర్యాదగా చెప్పించడంతో ఈ ఏడాది అక్టోబర్‌లో బకాయిలు చెల్లించి ఇల్లు ఖాళీ చేసేస్తానని ఎంపీ గోరంట్ల మాధవ్‌ హామీ ఇచ్చారు. కానీ నేటికీ ఇంటిని ఖాళీ చేయలేదు. బాకీలు చెల్లించలేదు.

ADVERTISEMENT

మల్లికార్జున రెడ్డి సోమవారం మళ్ళీ కొంతమంది పెద్దమనుషులను వెంటబెట్టుకొని గోరంట్ల మాధవ్‌ని తక్షణం ఇల్లు ఖాళీ చేయాలని ఒత్తిడి చేశారు. కానీ ఈసారి గోరంట్ల మాధవ్‌ వారిపై తిరగబడి “నేను ఇల్లు ఖాళీ చేయను… ఏం చేస్తారో చేసుకోండి.,” అంటూ వాగ్వాదానికి దిగారు. సమాచారం అందుకొన్న సీఐలు శివరాముడు, జాకీర్ హుస్సేన్ ఇద్దరూ గోరంట్ల మాధవ్‌కి నచ్చజెప్పేందుకు ప్రయత్నించగా ఆయన వారిపై కూడా చిందులు వేస్తూ ఈ విషయంలో జోక్యం చేసుకొంటే మీ సంగతి తేలుస్తానంటూ హెచ్చరించారని చెప్పారు.

గోరంట్ల మాధవ్‌ తనకు ఇంటి అద్దె రూ.13 లక్షలు, కరెంట్ బిల్లు రూ.2,50,413 బాకీ పడ్డారని కానీ వాటిని చెల్లించడానికి నిరాకరిస్తూ తిరిగి తాననే బెదిరిస్తున్నారని మల్లికార్జున రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గోరంట్ల మాధవ్‌ అధికార పార్టీకి చెందినవ్యక్తి అందునా… ఎంపీ కనుక పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసేందుకు సాహసించలేకపోతున్నారు.

ఈ వ్యవహారం అప్పుడే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఈసారి గోరంట్ల మాధవ్‌ని మంత్రులు, ఎమ్మెల్యేలు ఏవిదంగా సమర్ధించుకొంటారో చూడాలి. “ఆ ఇల్లు గోరంట్ల మాధవ్‌దే… కానీ మల్లికార్జున రెడ్డి టిడిపికి చెందిన వ్యక్తి కనుక అనవసరంగా ఈ రాద్దాంతం చేస్తున్నాడని ఆరోపిస్తూ పోలీసులు అతనిపైనే కేసు నమోదు చేసినా ఆశ్చర్యం లేదు.

ADVERTISEMENT
Latest Stories