వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిపై ఉద్యోగ సంఘాల నేతలు, ఉద్యోగులు నిప్పులు చెరుగుతున్నారు. ఉద్యోగుల ఆత్మస్థైర్యం దెబ్బతినేలా పదే పదే వ్యాఖ్యలు చేస్తున్న చెవిరెడ్డి వైఖరి సరైంది కాదని వారు మండి పడుతున్నారు. అధికారంలోకి వస్తే తమకి వ్యతిరేకంగా ఉన్న అధికారులను వెంటాడి, జైల్లో పెట్టిస్తామంటూ చెవిరెడ్డి వ్యాఖ్యానించడం ఉద్యోగుల్లో ఆగ్రహాన్ని తెప్పించింది. అయితే చెవిరెడ్డి ఇలాంటి హెచ్చరికలు చేయడం ఇదే మొదటిసారి కాదని… గతంలో కూడా ఇలాంటి హెచ్చరికలే జారీ చేశారని మండిపడ్డారు.
ఉద్యోగులతో పెట్టుకున్న ప్రజాప్రతినిధులు కాని, పార్టీలు కాని, సంస్థలు కాని మనుగడ సాగించలేకపోయాయనే విషయాన్ని చెవిరెడ్డి గుర్తు పెట్టుకోవాలని, తమకు పార్టీలతో సంబంధం లేదని… ఏ పార్టీ అధికారంలో ఉంటే, ఆ ప్రభుత్వ సూచనలకు, నిబంధనలకు అనుగుణంగా పని చేస్తామని తెలిపారు. ఉద్యోగులతో పెట్టుకుంటే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయంటూ ఉద్యోగ సంఘాల నేతలు వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు చెవిరెడ్డి భాస్కరరెడ్డి తాను చేసిన వ్యాఖ్యలను మరోసారి సమర్థించుకున్నారు.
అవినీతి అధికారులను, అధికార పార్టీకి అనుగుణంగా పని చేస్తున్న అధికారులను మాత్రం తాము వదిలిపెట్టమని స్పష్టం చేశారు. తమ పార్టీ నేతలు, కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న అధికారులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమని హెచ్చరించారు. దీంతో ఈ వ్యాఖ్యలపై ఉద్యోగ సంఘాల నేతల మరోసారి భగ్గుమన్నారు. రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిల హయాంలో అప్పటి ప్రభుత్వ నిబంధనల మేరకు అధికారులంతా పని చేశారనే విషయాన్ని చెవిరెడ్డి గుర్తుపెట్టుకోవాలని సూచించారు.
రేపు వైసీపీ ప్రభుత్వం వచ్చినా… ఆ ప్రభుత్వ సూచనల మేరకే పని చేస్తామని చెప్పారు. రాజకీయాలను పార్టీల వరకే పరిమితం చేసుకోవాలని… రాజకీయాల్లోకి ఉద్యోగులను లాగే ప్రయత్నం చేస్తే, చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఉద్యోగుల గురించి మాట్లాడేటప్పుడు నాలుకను కంట్రోల్ లో పెట్టుకోవాలని అన్నారు. ఇకపై కూడా ఇలాంటి ధోరణితోనే వ్యవహరిస్తే… రాబోయే రోజుల్లో ప్రతిఫలాన్ని అనుభవించాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.



