ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉపాధ్యాయులపై ఎంత గౌరవం అంటే నెలనెలా వారిని జీతాల కోసం రోడ్లపై నిలబెడుతుంటుంది. ఉపాధ్యాయులకు మద్యం షాపుల వద్ద డ్యూటీలు వేస్తుంది. డీఏ బకాయిలు విడుదలకి జీవో జారీ చేసి ఆ సొమ్ము వారికి చెల్లించకుండానే దానిపై ఆదాయపన్ను కోసేస్తుంటుంది. కనుక వారందరూ ప్రభుత్వం మీద తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని గుర్తించి, వారిని ఎన్నికల విధులలో ఉపయోగిస్తే మొదటికే మోసం వస్తుందనే భయంతో జీవో జారీ చేసి వారికి భోధనేతర డ్యూటీలు వద్దని చెపుతుంది.
ఇక ప్రభుత్వోద్యోగులన్నా ప్రభుత్వానికి ఎంతో నమ్మకం, గౌరవం. వారందరూ వైసీపీ కుటుంబంలో సభ్యులే అని చెపుతుంటారు మంత్రులు. బహుశః అందుకేనేమో ఉద్యోగులకు తెలియకుండా ప్రభుత్వం వారి సొమ్ము తీసి వాడేసుకొంటుంది. ఇదేమిటని వారు నిలదీస్తే ‘కంప్యూటర్ లాగేసింది… జస్ట్ టెక్నికల్ మిస్టేక్’ అని సర్ది చెపుతుంటారు. ఇక ప్రభుత్వోద్యోగులపై ప్రభుత్వానికి ఎంత నమ్మకమొ తెలియజేసే ఈ తాజా జీవో చూస్తే అర్దమవుతుంది.
రాష్ట్రంలో అవినీతిని నిరోదించేందుకు చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా ఇక నుంచి ప్రభుత్వోద్యోగులందరూ ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే ఉద్యోగులు రోజూ డ్యూటీకి వచ్చిన్నప్పుడు జేబులో రూ.500కి మించి నగదు ఉంచుకోకూడదని ఇదివరకు ఓ జీవో ఇచ్చింది. కానీ అవినీతి నిరోధక శాఖ సిఫార్సు మేరకు ఇక నుంచి రూ.1,000 ఉంచుకోవచ్చని ఈనెల 28న జారీ చేసిన జీవో నం: 162లో పేర్కొంది. ప్రస్తుతం వివిదరకాల మొబైల్ యాప్స్ ద్వారా ఆర్ధికలావాదేవీలు చేసే వెసులుబాటు ఉంది కనుక ప్రభుత్వోద్యోగులు డ్యూటీకి వచ్చినప్పుడు రూ.1,000 ఉంచుకోవలసిన అవసరం లేదని ఆ జీవోలో పేర్కొంది. కనుక ప్రభుత్వోద్యోగులు ప్రతీరోజు డ్యూటీకి హాజరైనప్పుడు విధిగా తమ వెంట తెచ్చుకొన్న సొమ్ముని రికార్డులో నమోదు చేయాలని జీవోలో పేర్కొంది. ఒకవేళ విధి నిర్వహణలో భాగంగా వేరే ప్రాంతాలకు వెళ్ళవలసి వచ్చిన్నప్పుడు రూ.10,000 వెంట తీసుకువెళ్లవచ్చని పేర్కొంది. ఈ నిబందనప్రభుత్వోద్యోగులు ఏవిదంగా స్పందిస్తారో?



