ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మద్య జలవివాదాలు పదేళ్ళుగా సాగుతూనే ఉన్నాయి. అయితే అవి కేవలం నీటి పంపకాల కోసమే అయితే ఏదో విదంగా పరిష్కరించుకోవచ్చు. కానీ వాటి వెనుక చాలా రాజకీయాలున్నందున అపరిష్కృతంగా ఉండిపోయాయి.
అయితే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో ఏ ఒక్క ప్రాజెక్టు గేట్లు మూసి నీటిని నిలువ చేయలేని పరిస్థితి నెలకొంది. బంగాళాఖాతంలో వాయుగుండం వలన రెండు రాష్ట్రాలలో భారీగా వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు మూడు ప్రధాన నగరాలను వరద నీరు ముంచెత్తుతోంది. మళ్ళీ చాలా ఏళ్ళ తర్వాత తొలిసారిగా విజయవాడ, గుంటూరు నగరాలలో పలు ప్రాంతాలు నీట మునిగాయి.
విజయవాడలో బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ మీద భారీగా నీరు చేరడంతో ముందు జాగ్రత్త చర్యగా వాహనాల రాకపోకలు నిలిపివేశారు. అలాగే ముందు జాగ్రత్త చర్యగా దుర్గగుడి ఫ్లైఓవర్ కూడా మూసివేశారు.
భారీ వర్షాల ధాటికి మొగల్రాజపురంలో కొండచరియాలు విరిగిపడి నలుగురు మరణించారు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం ఉప్పలపాడులో ఓ ఉపాధ్యాయుడు, ఇద్దరు విద్యార్దులు శనివారం ఉదయం కారులో ఇళ్ళకి తిరిగి వెళుతుండగా వాగులో కారు కొట్టుకుపోయింది. ముగ్గురూ మృతి చెందారు.
ప్రకాశం బ్యారేజీ 3.24 లక్షల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుండటంతో 70 గేట్లను ఎత్తేసి వచ్చిన నీటిని వచ్చిన్నట్లే దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక విజయవాడ-గుంటూరులో కానీ వినీ ఎరుగని స్థాయిలో భారీగా వర్షం కురుస్తుండటంతో రైల్వే ట్రాకులన్నీ నీళ్ళలో మునిగిపోయాయి. ముందస్తు జాగ్రత్త చర్యగా దక్షిణ మద్య రైల్వే ఏకంగా 20 రైళ్ళని రద్దు చేసింది. సోమవారం పూర్తిగా వర్షం తగ్గేవరకూ రైళ్ళు నడుపలేమని ప్రకటిచింది.
బంగాళాఖాతంలో తుఫాను ఆదివారం ఉదయం విశాఖ వద్ద తీరం దాటుతుందని వాతావరణశాఖ తెలియజేసింది. కనుక తుఫాను ప్రభావంతో అటు అనకాపల్లి నుంచి పశ్చిమ గోదావరి జిల్లా వరకు, ఉత్తరాంధ్రా జిల్లాలలో ఇటు విశాఖ నుంచి శ్రీకాకుళం వరకు భారీగా ఈరోజు ఉదయం నుంచే ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.
మంత్రులు వంగలపూడి అనిత, కొల్లు రవీంద్ర ఇద్దరూ జిల్లా కలెక్టర్లతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. అవసరమైన చోట సహాయ బృందాలను సిద్దంగా ఉంచాలని ఆదేశించారు. సిఎం చంద్రబాబు నాయుడు కూడా ఎప్పటికప్పుడు అన్ని జిల్లాల కలెక్టర్లతో మాట్లాడుతూ పరిస్థితిని సమీక్షించి అవసరమైన ఏర్పాట్లు చేయిస్తున్నారు.
హైదరాబాద్‌తో సహా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో సోమవారం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురువబోతున్నాయని వాతావరణశాఖ ముందే హెచ్చరించింది. రెండు తెలుగు రాష్ట్రాలలో రాబోయే రెండు రోజులు అతిభారీ వర్షాలు కురుస్తాయంటూ వాతావరణశాఖ రెడ్ అలర్ట్ కూడా ప్రకటించింది.
ఈ వర్షాలు, వరదలు, ప్రాజెక్టులలో నీటిని నిలువచేసుకోలేని పరిస్థితులు చూస్తున్నప్పుడు ఈ నీళ్ళ కోసమే రెండు తెలుగు రాష్ట్రాలు కీచులాడుకుంటున్నాయి అని అనిపించక మానదు. వర్షాలు కురవకపోతే నీళ్ళ కోసం కొట్లాటలు, కురిస్తే భరించలేక తిప్పలు తప్పడం లేదు. కనుక రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రజలు ‘రెయిన్ రెయిన్ గో ఎవే…’ అని రైమ్స్ పాడుకోవలసిందే… తప్పదు ప్రకృతిని కాదని అంతకన్నా ఏం చేయగలం?




