ఏపీకి దక్కాల్సిన “ప్రత్యేక హోదా” అంశంపై కేంద్ర ప్రభుత్వాన్ని చీల్చిచెండాడే ప్రముఖ నటుడు శివాజీ తాజాగా మరో సామాజిక అంశంపై స్పందించారు. “హైదరాబాద్ లాంటి గ్లోబల్ సిటీలో అడవి జంతువుల్లా ప్రవర్తిస్తున్నామని” ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో చిన్నారి రమ్య మృతికి సంతాపంగా జరిగిన ర్యాలీలో పాల్గొన్న శివాజీ మాట్లాడుతూ, అవసరం ఉన్నా లేకున్నా గమ్యాన్ని తొందరగా చేరుకోవాలన్న ఆలోచనతో అడవిలో జంతువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.
అడవిలో జంతువులకు ఎలాంటి నిబంధనలు ఉండవని, వేట అన్నదే లక్ష్యంగా ప్రయాణిస్తాయని, మనిషికి అలాంటి అవసరం లేకున్నప్పటికీ వాహనంతో రోడ్డెక్కగానే రూల్స్ తో సంబంధం లేకుండా ప్రయాణం చేస్తాడని, దీనికి ఎవరూ అతీతం కాదని అన్నారు. ఇలాంటి సందర్భాల్లోనే దుర్ఘటనలు చోటుచేసుకుంటాయని ఆయన చెప్పారు. ఇలాంటి ఘటనల వల్ల బాధితులు తీవ్రంగా నష్టపోతారని, దానికి కారణం ఎవరని? ఏంటని? ఆలోచించాలని సూచించారు. తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరిస్తే ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవని అన్నారు.



