కవిత రాజకీయం మొత్తం బిఆర్ఎస్ నేతల కేంద్రంగా తిరుగుతుంటే, బిఆర్ఎస్ రాజకీయం మొత్తం బాబు కేంద్రంగా ఏపీ నీటి ప్రోజెక్టుల చుట్టూ తిరుగుతుంది. ఆవు పాఠం మాదిరి బిఆర్ఎస్ ఎటు నుంచి ఎటు వెళ్లినా తిరిగి బాబు దగ్గరకే వస్తుంది, ఏపీ నీటి ప్రోజెక్టుల వద్దే ఆగుతుంది.
నాడు తెలంగాణలో జరిగిన పంచాయితీ ఎన్నికల సమయంలో తన గురువు బాబుకి రేవంత్ బనకచర్ల ప్రాజెక్ట్ ని గురు దక్షిణగా అందించేందుకు సిద్ధమయ్యారని ఆరోపించిన బిఆర్ఎస్, నేడు తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బాబు – రేవంత్ మధ్య పూర్తి అండర్ స్టాండింగ్ తో ఏపీలో నల్లమల ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటుంది అంటూ మొదలుపెట్టారు.
తెలంగాణ నీటి హక్కులను ఏపీ పాలకుల చేతిలో పెట్టాడు, ఏపీలో బాబు ఇస్తున్న ఆదేశాలతోనే తెలంగాణలో రేవంత్ పాలన చేస్తున్నారు, టీడీపీ నాయకుడిగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వరిస్తున్నాడు రేవంత్ అంటూ ఏపీలో కూటమి ప్రభుత్వం నిర్మించదలిచ్చిన బనకచర్ల ప్రాజెక్ట్ పై బిఆర్ఎస్ నాడు రాజకీయం మొదలుపెట్టింది.
ఇక ఇప్పుడు తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో తిరిగి బిఆర్ఎస్ ఇరు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జల వివాదాలకు ప్రాణం పోస్తుంది. నాడు బనకచర్ల కేంద్రంగా ప్రాంతీయ రాజకీయం నడిపిన బిఆర్ఎస్ నేడు దాన్ని నల్లమలసాగర్ పైకి మళ్లించింది.
బనకచర్ల నుంచి నల్లమల సాగర్ గా ఏపీ ప్రభుత్వం జలదోపిడీ పేరు మార్చింది తప్ప గోదావరి జలదోపిడీ ని కొనసాగిస్తూనే ఉంది. అయితే ఈ దోపిడీలో కత్తి చంద్రబాబు దే అయినా పొడిచేది మాత్రం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ కావడం ఇక్కడ విచిత్రం.
గతంలో కేసీఆర్ “కత్తి ఆంద్రోళ్ళది కానీ పొడిచేటోడు మాత్రం మనోడే ” అన్నట్టుగా ఇక్కడ కూడా ఆలోచన ఆంధ్రోళ్ళది దాని ఆచరణ తెలంగాణ వాడిది అన్నట్టుగా రేవంత్ హయాంలో తెలంగాణ జలహక్కులు ఏపీ ప్రభుత్వ ఆధీనంలోకి వెళుతున్నాయి అంటూ హరీష్ తమ మున్సిపల్ ఎన్నికల ప్రచార ఏజెండాను బయటకుతీసారు.
ఇలా బిఆర్ఎస్ నాయకులు తమకు రాజకీయ అవసరాలు ఏర్పడినప్పుడు, తమ పార్టీ రాజకీయంగా బలపడాలని భావించిన్నప్పుడు ఏపీ – తెలంగాణల మధ్య అయితే పోలవరం లేకుంటే పట్టిసీమ, అలాగే అయితే బనకచర్ల లేకుంటే నల్లమల అంటూ ఇరు రాష్ట్రాల మధ్య నీటి రాజకీయాలకు తెరలేపుతూ రెండు రాష్ట్ర ప్రజల మధ్య విద్వేష వాతావరణాన్ని సృష్టిస్తున్నారు.
ఇక దీని ప్రకారం చూస్తే తెలంగాణలో ఎన్నికలు ఏ రూపంలో వచ్చినా అందుకు బిఆర్ఎస్ ముందున్న ఎన్నికల ప్రచార ఏజెండా మాత్రం ఏపీ నీటి ప్రాజెక్టులే అనేది తేలిపోయింది.
అలాగే బిఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంటే టీడీపీ పై విష ప్రచారం, బిఆర్ఎస్ అధికారంలో ఉంటే బాబు పై విద్వేషం తప్పనిసరి అన్నట్టుగా ఆ పార్టీ నేతల రాజకీయం కొనసాగుతుంది. ఏదిఏమైనా కేసీఆర్ తెరాస, బిఆర్ఎస్ గా మారినా దాని మూలాలు ఇంకా ప్రాంతీయవాదం దగ్గరే ఆగిపోయాయనేది సుస్పష్టం.






