చంద్రబాబు నాయుడు గతంలో జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పారు. ఇప్పుడూ తిప్పుతున్నారు. కానీ అంత మాత్రాన్న డప్పు కొట్టుకోవడం లేదు. టీడీపి పేరుని బీడీపీగా మార్చలేదు. కానీ నేటికీ జాతీయస్పూర్తితోనే రాజకీయాలు చేస్తున్నారు.
తెలంగాణ మాజీ సిఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పుతానని డప్పు కొట్టుకున్నారు. “నేను ప్రధానమంత్రి అయ్యి దేశాన్ని ఉద్దరిస్తే మీకు ఒకేనా కాదా?” అంటూ సభలలో తెలంగాణ ప్రజలను అడుగుతూ ఉండేవారు.
కేసీఆర్ ‘దేశ్ కీ నేత’ అని ఫ్లెక్సీ బ్యానర్లు పెట్టించుకున్నారు. వాటికి పాలాభిషేకాలు కూడా చేయించుకున్నారు. ఢిల్లీపైకి దండయాత్రకి బయలుదేరేందుకు టిఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్ పార్టీగా మార్చేసుకున్నారు.
ఈ స్టోరీలన్నీ అందరికీ తెలిసినవే. కానీ రామాయణ, మహాభారత, భాగవతాల గురించి ఎన్నిసార్లు చెప్పుకున్నా తనివి తీరనట్లు ఇవీ అంతే!
కేసీఆర్ జాతీయస్థాయిలో రాజకీయాలు చేయాలనుకున్నప్పుడు ఉత్తరాది రాష్ట్రాలలో రైతుల సమస్యల గురించి మాట్లాడేవారు. జాతీయస్పూర్తి, గుణాత్మక మార్పు వంటి పదాలు అయన ప్రసంగంలో అలవోకగా దొర్లుతుండేవి.
కానీ ఆయన మాటలకు చేతలకు ఎక్కడా పొంతన ఉండేది కాదు. ఏపీ, మహారాష్ట్రలకు తన పార్టీని విస్తరించడం అవసరమనుకున్నారు. కానీ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ తప్ప మరో పార్టీ ఉండొద్దనుకున్నారు. ఆయన భాషలో జాతీయవాదం, జాతీయస్పూర్తికి బహుశః వేరే అర్థం ఉండి ఉండవచ్చు.
కానీ ఒకే ఒక్క ఓటమితో ఆయన జాతీయ రాజకీయాలు, జాతీయ వాదం, జాతీయస్పూర్తి, దేశ్ కీ నేత అన్నీ మాయం అయిపోయాయి.
ఏ మనిషి డీఎన్ఏ ఎన్నటికీ మారదు. కనుక కేసీఆర్ డీఎన్ఏ కూడా మారలేదు. కేసీఆర్‌లో మళ్ళీ మునుపటి ప్రాంతీయవాది పరకాయ ప్రవేశం చేశాడు. కనుకనే కృష్ణ జలాలు, ఏపీ ప్రాజెక్టులపై అగ్గిరాజేస్తున్నారు. కనుక కేసీఆర్ ఈవిధంగా నీళ్ళ రాజకీయాలు చేయడం విచిత్రమేమీ కాదు.
కానీ విచిత్రమైన విషయం ఏమిటంటే, అధికార కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తాను కోరుకున్న దిశలో నడిపిస్తున్నారు. సిఎం రేవంత్ రెడ్డి చేతికి కత్తి ఇచ్చి ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుతో యుద్ధం చేయిస్తుండటమే విశేషం. కేసీఆర్ ఆడమన్నట్లు తాము ఆడుతున్నామనే విషయం రేవంత్ రెడ్డి గ్రహించారో లేదో తెలీదు.
కానీ సిఎం చంద్రబాబు నాయుడు ఎప్పటిలాగే రెండు తెలుగు రాష్ట్రాలు పోటాపోటీగా అభివృద్ధి చెందాలని, రెండు రాష్ట్రాల రైతులకు సంవృద్ధిగా నీళ్ళు అందాలని కోరుకుంటున్నారని టీడీపి సీనియర్ నేత కొమ్మారెడ్డి పట్టాభిరాం అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయవాదంతో రాజకీయాలు చేస్తూ తెలంగాణలో పైచేయి సాధిస్తోంది. ఏపీలో వైసీపీ కూడా ఏపీ ప్రయోజనాలే మాకు ముఖ్యం. బీఆర్ఎస్ రాజకీయాలతో ఏపీకి నష్టం జరుగుతోందని చెప్పాలి కదా? కానీ వైసీపీ, బీఆర్ఎస్ పార్టీతో, వాటి సొంత మీడియాలు చేతులు కలిపి ఏపీకి వ్యతిరేకంగా నీచ రాజకీయాలు చేస్తున్నాయని పట్టాభిరాం ఆరోపించారు.
బీఆర్ఎస్ నేతలు నీళ్ళ పేరుతో నీచ రాజకీయాలు చేస్తుంటే, మాజీ సిఎంగా 5 ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించిన జగన్మోహన్ రెడ్డి వారికి వంతపాడుతూ రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తున్నారని కొమ్మారెడ్డి పట్టాభిరాం అన్నారు. పదవి అధికారం, రాజకీయ ప్రయోజనాల కోసం సొంత రాష్ట్రానికి నష్టం కలిగించడమంటే నడి సముద్రంలో కూర్చున్న పడవకి కన్నం పెట్టుకున్నట్లే అని జగన్ ఎప్పుడు గ్రహిస్తారో?






