HYDRAA Issue In High Court .... Revanth Reddy On Delhi Tour

హైడ్రా హైదరాబాద్‌లో వరుసపెట్టి భవనాలు కూల్చేస్తుంటే తెలంగాణ హైకోర్టు కూడా స్పందించకపోవడంతో ఇక దానిని అడ్డుకునేవాళ్ళే లేరన్నట్లు దూసుకుపోయింది. అయితే మూసీనది పక్కనే ఇళ్ళు నిర్మించుకొని దశాబ్ధాలుగా ఉంటున్న సామాన్య, మద్య తరగతి ప్రజలపై దృష్టి సారించేసరికి హైడ్రాకి తొలిసారిగా ఎదురుదెబ్బ తగిలింది.

మూసీవాసులకు ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కేటాయించి వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించేందుకు ప్రయత్నించగా పెద్ద ఎత్తున తిరుగుబాటు చేశారు. హైకోర్టులో సుమారు 20 పిటిషన్లు వేసి ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఇళ్ళ వ్యవహారం హైకోర్టులో ఉందంటూ ప్రతీ ఇంటి గోడపై ఫ్లెక్సీ బ్యానర్స్ ఏర్పాటు చేసుకున్నారు. మూసీవాసులు తమ వీధుల్లో టెంట్లు వేసుకొని సమావేశాలు పెట్టుకుంటున్నారు. రేయింబవళ్ళు కాపలాకాస్తున్నారు.

Also Read – జగన్‌, కేసీఆర్‌… ఎప్పుడు బయటకు వస్తారో?

సాధారణంగా పేద, మద్యతరగతి ప్రజలు ఎన్ని కష్టాలు ఎదురవుతున్నా మౌనంగా భరిస్తూ జీవనం సాగిస్తారే తప్ప ఎన్నడూ బహిరంగంగా ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని వేలెత్తి చూపి విమర్శించడానికి, నిందించడానికి ఇష్టపడరు. కానీ తొలిసారిగా మూసీవాసులు బహిరంగంగా తమ సిఎం రేవంత్‌ రెడ్డిని తిట్టిపోస్తున్నారు. మీ పార్టీకి ఓట్లు వేసి గెలిపించినందుకు బాగా బుద్ధి చెపుతున్నారంటూ విరుచుకుపడుతున్నారు.

ఈ హైడ్రా పంచాయితీ హైకోర్టుకి చేరడంతో, హైడ్రా కమీషనర్‌గా రంగనాద్‌ని కోర్టుకి రప్పించి అక్షింతలు వేసింది. శనిఆదివారాలలో ఇళ్ళు కూల్చరాదని గతంలో హైకోర్టు ఆదేశించినప్పటికీ, అదే రోజున ఎందుకు కూల్చుతున్నారని ప్రశ్నించింది. ఇకపై హైకోర్టు ఆదేశాలను, నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని, మరోసారి ఇలా చేస్తే కోర్టు ధిక్కారంగా పరిగణించి కటిన చర్యలు తీసుకుంటామని హైకోర్టు హెచ్చరించింది.

Also Read – మద్య నిషేదమని స్టోరీ చెప్పలేదు…

హైడ్రా కూల్చివేతలతో ఒక్క హైదరాబాద్‌లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ప్రభుత్వం తీరుని తప్పు పడుతున్నారు. బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలు కూడా రంగంలో దిగి కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తున్నాయి. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయలేకపోయినా, పాలనలో ప్రజల అంచనాలు అందుకోలేకపోతున్నా ఎవరూ నోరు విప్పలేదు.

కానీ హైడ్రా సామాన్య ప్రజలు జోలికి వచ్చేసరికి వారు రోడ్లపైకి వచ్చి రేవంత్‌ రెడ్డిని విమర్శిస్తున్నారు. తిట్టిపోస్తున్నారు. హైడ్రా కూల్చివేతలని తప్పు పడుతున్నారు. ఇప్పుడు హైకోర్టు కూడా హైడ్రాకి బ్రేకులు వేసింది. బహుశః అందుకేనేమో రేవంత్‌ రెడ్డికి ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. ఆయన నిన్న రాత్రి హడావుడిగా బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళ్ళారు.

Also Read – 2027లో జమిలి ఎన్నికలు… చంద్రబాబు నాయుడు సై?


మంత్రివర్గ విస్తరణ గురించి చర్చించేందుకు రేవంత్‌ రెడ్డి ఢిల్లీ వెళ్ళారని సమాచారం. కానీ హైడ్రా కారణంగా కేవలం 10 నెలల్లోనే ఇంత ప్రజా వ్యతిరేకత నెలకొనడంతో రేవంత్‌ రెడ్డికి అక్షింతలు, బ్రేకులు వేసేందుకే పిలిపించి ఉండవచ్చు. లేకుంటే రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని కేసీఆర్‌ కాదు…. హైడ్రా కూల్చివేసే ప్రమాదం కనిపిస్తోంది.