‘జెంటిల్మెన్ గేమ్’లో ఎప్పుడు ఏదైనా జరగడానికి ఆస్కారం ఉంటుందని చెప్పడానికి… ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా జరిగిన ఇండియా – శ్రీలంక మ్యాచ్ నిదర్శనంగా నిలుస్తోంది. ఫాంలో లేని శ్రీలంకను టీమిండియా అవలీలగా ఓడించేస్తుందని భావించిన ప్రతి ఒక్కరికీ షాక్ నిచ్చే విధంగా లంకేయులు టీమిండియాపై జయకేతనం ఎగురవేసారు. దీంతో గ్రూప్ బిలో జరగనున్న మిగిలిన రెండు మ్యాచ్ లు క్వార్టర్ ఫైనల్స్ గా మారిపోయాయి.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంక నిర్ణయం తప్పు అనిపించే విధంగా టీమిండియా ఓపెనర్లు బ్యాటింగ్ చేసారు. రోహిత్ శర్మ 78 పరుగులతో రాణించగా, మరో ఓపెనర్ శిఖర్ ధావన్ ఏకంగా సెంచరీ (125) బాది తన సత్తా ఏమిటో నిరూపించాడు. ఓపెనర్లు ఇచ్చిన అవకాశాన్ని మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్లు విరాట్ కోహ్లి, యువరాజ్ సింగ్ లు సద్వినియోగం చేసుకోకపోవడంతో… మిడిల్ ఓవర్స్ లో టీమిండియా స్కోర్ వేగం మందగించింది.
అయితే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని (63) చెలరేగడంతో 321 పరుగుల భారీ స్కోర్ ను నమోదు చేసింది. లక్ష్య చేధనలో తొలి వికెట్ ను త్వరగా కోల్పోయినప్పటికీ, రెండవ వికెట్ కు ఏకంగా 159 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో మ్యాచ్ లంకేయుల వైపుకు మళ్ళింది. ఆ తర్వాత మూడవ వికెట్ కూడా వెంటనే కోల్పోయినప్పటికీ, కెప్టెన్ మాథ్యూస్ (52), గుణరత్నె (34) అండతో మ్యాచ్ లో విజయం సాధించారు.
ఓపెనర్ గుణతిలక 76, వన్ డౌన్ బ్యాట్స్ మెన్ మెండిస్ 89, పెరేరా (47 రిటైర్డ్ హార్ట్) వరుసగా క్రీజులోకి వచ్చిన ప్రతి బ్యాట్స్ మెన్ కూడా టీమిండియా బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ అలవోకగా పరుగులు రాబట్టారు. ఏ సమయంలోనూ రన్ రేట్ చేయి దాటకుండా చూసుకోవడంలో శ్రీలంక సక్సెస్ అయ్యింది. దీంతో 48.4 ఓవర్లలోనే 322 పరుగులు చేసి జయకేతనం ఎగురవేసింది. ఈ విజయంతో ఇతర జట్ల జాతకాలు కూడా మారిపోయాయి.
ఇంకా గ్రూప్ బిలో రెండు మ్యాచ్ లు మిగిలి ఉండగా, ప్రతిదీ క్లైమాక్స్ తరహాలోనే… ఆ రెండు మ్యాచ్ లలో గెలిచిన జట్లు సెమీస్ కు చేరనున్నాయి. దక్షిణాఫ్రికాతో ఇండియా తలపడనుండగా, శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య మరో మ్యాచ్ లు జరగనుంది. ఒకవేళ వర్షం వలన మ్యాచ్ లు రద్దయితే, నెట్ రన్ రేట్ కీలకం కానుంది. అప్పుడైతే మిగిలిన జట్లతో పోలిస్తే టీమిండియా మెరుగైన స్థానంలో ఉంది.



