అంగరంగ వైభవంగా జరిగిన గాలి జనార్ధన్ రెడ్డి కుమార్తె బ్రాహ్మిణి వివాహానికి సంబంధించి ఐటీ శాఖ జారీ చేసిన నోటీసుల నేపధ్యంలో బుధవారం నాడు అధికారుల ముందు గాలి హాజరు కావాల్సి వచ్చింది. ఈ సందర్భంగా అధికారులు వేసిన లెక్కకు మించిన ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి కావడం గాలి వంతయ్యిందని సమాచారం. డబ్బు సేకరణకు సంబంధించి మాత్రం తనకున్న ఆస్తులను కుదవపెట్టి తీసుకొచ్చినట్లు సమాధానం చెప్పిన గాలి, మరికొన్ని ప్రశ్నలకు మాత్రం తల పట్టుకోవాల్సి వచ్చిందని, ప్రస్తుతం జవాబులు చెప్పలేని ప్రశ్నలకు సంబంధించి వివరణ ఇవ్వాల్సిందిగా అధికారులు కోరారని తెలుస్తోంది.
ముఖ్యంగా… బ్రాహ్మిణి వివాహానికి ముందు, ఆ తర్వాత జరిగిన ఖర్చుల వివరాలను సమగ్రంగా సమర్పించాలని, ఈ వేడుకకు విచ్చేసిన అతిధుల వివరాలతో పాటు వారికి రవాణా, వసతి సౌకర్యాల కోసం చేసిన ఖర్చులను, బౌన్సర్లకు చెల్లించిన సొమ్ముల వివరాలను, వినోద కార్యక్రమాల కోసం చేసిన ఖర్చును, హీరోయిన్ల ఆటపాటలకు పెట్టిన మొత్తాన్ని, ఈవెంట్ మేనేజ్మెంట్ కోసం చేసిన ఖర్చులను, అలాగే అతిధులు ఇచ్చిన కానుకల వివరాలను పూర్తిగా తెలపాలని ఆదేశించారు.
ఇవి కాకుండా పెళ్లి కూతురు బ్రాహ్మిణి ధరించిన నగలు ఎక్కడ నుండి కొనుగోలు చేసారు? వాటికి ఎంత మొత్తం ఖర్చయ్యింది? అలాగే పెళ్లి ఖర్చుల నిమిత్తం వినియోగించిన డెబిట్, క్రెడిట్ కార్డుల వివరాలను, జరిపిన లావాదేవీలను కూడా ఇవ్వాలని ఆదేశించినట్లుగా తెలుస్తోంది. ఐటీ అధికారుల ప్రాధమిక అంచనా మేరకు దాదాపుగా 300 కోట్లను ఈ వేడుక నిమిత్తం ఖర్చు చేసినట్లుగా అంచనా వేస్తున్నారు. అధికారులకు అందిన సమాచారంతో గాలి సమర్పించే ఆధారాలు సరిపోని పక్షంలో… గాలి బుక్ అయినట్లేనని, మరోసారి చట్టపరమైన చర్యలకు అధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం.



