ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 10 ఫైనల్ ముందు వరకు రైజింగ్ పూణే సూపర్ జైంట్స్ ఫ్రాంచైజ్ వేదికగా చాలా హడావుడి జరిగింది. ముఖ్యంగా ధోనిని తక్కువ చేస్తూ పూణే జట్టు యాజమాన్యం చేసిన వ్యాఖ్యలకు ధోని అభిమానులతో పాటు, క్రికెట్ ప్రేమికులు కూడా కలత చెందారు. సోషల్ మీడియా వేదికగా పూణే యాజమాన్యంపై విరుచుకుపడ్డారు. అయితే అంతకు ముందు ఎవరు గెలిపించినా… ఫైనల్లో కప్ తీసుకువచ్చే వీరుడు ఎవరన్నది అత్యంత కీలకమైన అంశం. కానీ పూణే జట్టు తలచింది ఒకటి… జరిగింది మరొకటి..!
మ్యాచ్ ప్రారంభానికి ముందే ‘పార్టీ ఎక్కడ చేసుకుందాం?’ అని ధోని స్మిత్ ను అడుగుతున్నట్లుగా… దానికి స్మిత్ ‘ప్యారడైజ్ బిర్యానీ’ అని సమాధానం ఇచ్చినట్లుగా ఫోటోను పోస్ట్ చేసిన రైజింగ్ పూణే సూపర్ జైంట్స్ యాజమాన్యానికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది ఎవరు? మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనినా? ప్రస్తుత కెప్టెన్ స్టీవెన్ స్మిత్తా? కేవలం 130 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక చతికిలపడేలా చేసింది ఎవరు? 17 ఓవర్ల పాటు క్రీజులో ఉన్న స్మిత్ కారణమా? 4 ఓవర్ల పాటు క్రీజులో ఉన్న ధోని కారణమా?
ఈ ప్రశ్నలను తలెత్తేలా చేసింది పూణే జట్టు యాజమాన్యం. 2.2 ఓవర్ వద్ద త్రిపాఠి పెవిలియన్ కు చేరుకోగా క్రీజులోకి వచ్చిన స్మిత్ 19.3 వద్ద పెవిలియన్ చేరుకున్నాడు. 50 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 51 పరుగులు చేసిన స్మిత్ అతి జాగ్రత్త వలనే పూణే ఓటమి పాలైందని క్రీడా విశ్లేషకులతో పాటు క్రికెట్ అభిమానులు కూడా స్మిత్ పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. లక్ష్యం చిన్నదే కావడంతో వికెట్లు కోల్పోకూడదనే స్మిత్ ఉద్దేశం మంచిదే అయినా, అది చివరికి తన పీక మీద కత్తిలా మారుతుందని అంచనా వేయలేకపోయాడు.
చివరి ఓవర్ వరకు క్రీజులో ఉండి కూడా మ్యాచ్ ను గెలిపించుకోలేక, చివరికి ఓ భారీ షాట్ కు ప్రయత్నించి బౌండరీ వద్ద అంబటి రాయుడుకు దొరికిపోయాడు. ఇక ధోని విషయానికి వస్తే… క్రీజులోకి వచ్చే సమయానికి కోల్పోయింది రెండు వికెట్లే అయినప్పటికీ, ధోని కూడా జాగ్రత్తగా బ్యాటింగ్ చేయడంతో బంతులన్నీ వృధా అయ్యాయి. కీలకమైన దశలో 13 విలువైన బంతులను ఎదుర్కొన్న ధోని కేవలం 10 పరుగులు మాత్రమే సాధించాడు. అయితే ధోని ఔటయ్యే సమయానికి పూణే విజయానికి 22 బంతుల్లో 32 పరుగులు మాత్రమే చేయాల్సి ఉంది.
అప్పటికే క్రీజులో స్మిత్ ఉన్నాడు, ఆ తర్వాత మనోజ్ తివారీ జత కలిసాడు. కానీ ధోని వికెట్ లభించిన తర్వాత విజయంపై ముంబైలో నమ్మకం మరింతగా బలపడింది. ఒక్కసారిగా మ్యాచ్ స్వరూపం మారిపోయింది. కీలకమైన చివరి దశలో డాట్ బాల్స్ పడ్డాయి. దీంతో రెట్టించిన ఉత్సాహంతో బౌలింగ్ చేసిన ముంబై బౌలర్లు ‘స్మిత్ అండ్ కో’కు షాక్ ఇవ్వడంలో సక్సెస్ సాధించారు. నిన్నటివరకు స్మిత్ వలనే ఫైనల్ కు చేరామని భీరాలు పలికిన పూణే యాజమాన్యం, ఇప్పుడు స్మిత్ వలనే ఓటమి పాలయ్యామని చెప్పగలుగుతుందా?
నిజానికి ఓడిపోవాలని ఏ జట్టు కోరుకోదు. ఫైనల్ మ్యాచ్ లో ఓటమిలో కూడా స్మిత్ భాగస్వామ్యుడే గానీ, పూణే ఓటమికి స్మిత్ ను ఒక్కడినే బాధ్యుడ్ని చేయడం సరైన విషయం కాదు. ఆట అన్నాక ఒకరు గెలుస్తారు, మరొకరు ఓడిపోతారు, ఇది సహజం. కానీ గెలిచిన సమయంలో ఏమో స్మిత్ ని అభినందిస్తూ… ఓడిన సమయంలో ధోనిని విమర్శించడం అనేది… కేవలం అవగానారాహిత్యం అనే భావించాలి. అందుకేనేమో ఫైనల్లో “స్క్రిప్ట్” స్మిత్ ను విమర్శలకు గురిచేసేలా రాసింది..!



