కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ని విమర్శించే సాహసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఏ రాజకీయ పార్టీకి లేదనేది కాదనలేని సత్యమే. రాష్ట్రానికి తమ హక్కుగా రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు, కేంద్ర సంస్థలు ఇలా ఏఒక్కదాని కోసం కూడా గొంతెత్తి ప్రశ్నించలేని పరిస్థితి ఏపీ రాజకీయ నాయకులది.
అధికార పార్టీ వైసీపీకి పాత కేసులు తిరగదోడతారేమో అన్న భయం,ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశంకు కొత్త కేసులలో ఇరికిస్తారేమో అన్న బెడద, మిత్ర పక్షంగా ఉన్న జనసేనకు ఎటు తేల్చుకోలేని సందిగ్దత ఇలా తలో పార్టీ తలో రకంగా బీజేపీ కనుసన్నల్లో నడుస్తుండడం రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.
గతంలో టీడీపీ పార్టీతో పొత్తు పెట్టుకుని రాష్ట్రంలో మంత్రి పదవులు అనుభవించిన బీజేపీ పార్టీ మిత్ర పక్షంగా ఉన్న టీడీపీ కి రాష్ట్రాభివృద్ధిలో ఎంతటి సహకారం అందించిందో అందరు చూస్తూనే వచ్చారు. ప్రత్యేక హోదా మొదలు ప్రత్యేక ప్యాకేజీ వరకు చెప్పింది ఒకటి చేసింది మరొకటి. విభజన హామీలు,రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పోలవరం అనుమతులు, అమరావతి నిర్మాణానికి నిధులు ఇలా అడుగడుగునా టీడీపీకి అడ్డంకులే సృష్టించారు.
బీజేపీ వైకరితో విసిగిపోయిన టీడీపీ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించక తప్పని పరిస్థితికి వచ్చింది.ఇప్పుడు చంద్రబాబు ఎదుర్కుంటున్నఈ గడ్డు పరిస్థితికి ఇది కూడా ఒక కారణంగా పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతుంది. నిధులు లేక ఇచ్చిన హామీలు పూర్తిగా అమలు చేయలేక 2019 ఎన్నికలలో టీడీపీ ప్రతిపక్షానికే పరిమితమయ్యింది.
ఇలా 2014 లో మిత్రపక్షంగా ఉన్న టీడీపీని 2019 నాటికి ప్రతిపక్షంగా మార్చడానికి బీజేపీకి వైసీపీ తో ఉన్న లోపాయకారి ఒప్పందాలే కారణం అనేది జగమెరిగిన సత్యమే. అలాగే 2019 ఎన్నికల తరువాత అధికారికంగా జనసేన – బీజేపీ పొత్తులో ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయం వలన రాష్ట్రం మాట అటుంచితే కనీసం పవన్ కళ్యాణ్ కు దక్కిన మేలేమిటో జనసేనాని ఒక్కసారి ఆలోచించాలి.
జగన్ మొదలుకొని ఆ పార్టీనేతలందరు పవన్ పై చేసిన వ్యక్తిత్వ హననానికి అటు బీజేపీ పెద్దలనుండి పవన్ కు అనుకూలంగా జగన్ కు వ్యతిరేకంగా కనీసం ఒక్క ప్రకటన కూడా రాలేదు. అంతే బీజేపీ మిత్రపక్షాలకు ఇచ్చే స్నేహహస్తం ఇదేనేమో! పొత్తు ఒకరితో పైరవీలు మరొకరితో అన్న చందంగా బీజేపీ అడుగులు వేయడం పవన్ ఇప్పటికైనా గ్రహించాలి.
పొత్తు ఎవరితో అన్నది ముఖ్యం కాదు మద్దతు ఎవరికీ ఇస్తున్నారనేదే ఇక్కడ చర్చ. కేంద్రం అండదండలు లేకుండా జగన్ ప్రతిపక్ష పార్టీనేతలపై ఇటువంటి దుస్సాహసాలకు పాల్పడతారని అనుకోవడం అవివేకమే అవుతుంది. దేశంలో బీజేపీ మిత్రపక్షాల సంఖ్యా నానాటికి తగ్గుతూ వస్తుండండంతో బీజేపీ పెద్దలు ప్రాంతీయ పార్టీలతో ఇలా లోపాయికారి ఒప్పందాలతో ముందుకెళ్లాడనికి సిద్ధంగా ఉన్నారనే భావన సర్వత్రా వినపడుతుంది.
అందుకే పెద్దలు అంటుంటారు “ముందొచ్చిన చెవులకన్నా వెనకొచ్చిన కొమ్ములే ముఖ్యమని”…,అలాగే బీజేపీ కూడా “అధికారిక మిత్రపక్షాల కన్నా- లోపాయికారి పొత్తులకే ప్రాధాన్యత” అన్నట్లు వ్యవహరించడం ఇకనైనా బీజేపీ మిత్రపక్షాలు గమనించాలి.



