కల్వకుంట్ల నుంచి బిఆర్ఎస్ చేజారుతుందా.?

Brs Leadership Crisis

ఒక్క ఓటమి బిఆర్ఎస్ ఉనికి చుట్టూ కల్వకుంట్ల కుటుంబం చుట్టూ ఎన్నో ప్రశ్నలను లేవనెత్తుతుంది. బిఆర్ఎస్ ఓటమి తో కేసీఆర్ పార్టీలో మౌన దీక్ష పాటిస్తున్నారు, కవిత సస్పెన్షన్ వేటుతో పార్టీ నుండి బయటకొచ్చారు, ఇక కేటీఆర్ విచారణ పేరుతో పార్టీ కార్యక్రమాలకు దూరం కాబోతున్నారు.

ఇటువంటి పరిస్థితులలో బిఆర్ఎస్ మెల్లమెల్లగా కల్వకుంట్ల చేతి నుండి చేజారబోతుందా అన్న సందేహాలు మొదలయ్యాయి. అయితే ఈ అనుమానాలకు ఆజ్యం పోసింది కూడా కల్వకుంట్ల కుటుంబ సభ్యురాలు కవితే. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో కేటీఆర్ పై విచారణకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతిచ్చారు.

ADVERTISEMENT

అయితే దీని పై స్పందించిన కేటీఆర్ సోదరి కవిత బీజేపీ నేతలకు పనిలేక వాళ్ళ పై వీళ్ల పై కేసులు పెడుతూ దేశంలో, రాష్ట్రంలో కక్ష్య పూరిత రాజకీయాలకు తెరలేపుతున్నారని, అందుకు మొదటి సాక్షి ని నేనేనంటూ గతంలో తన పై జరిగిన అరెస్టు ఉదంతాన్ని ఉదహరించారు.

అలాగే బీజేపీ నయానో భయానో బిఆర్ఎస్ ను విలీనం చేసుకుని తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ ఉనికి లేకుండా కేసీఆర్ ప్రస్తావన లేకుండా చెయ్యాలని భావిస్తున్నట్టు కవిత పలుమార్లు ఆరోపించారు. అలాగే తన సస్పెన్షన్ వెనుక, పార్టీ బీజేపీ లో విలీనం వైపు పార్టీ ముఖ్య నేతలు హరీష్, సతీష్ ల హస్తం ఉందంటూ ధ్వజమెత్తారు.

వారి రాజకీయ క్రీడలో మొదటిగా బలైన రాజకీయ నేత తనేనని, కక్ష రాజకీయాలలో భాగంగా ఈ రోజు నాకు వచ్చిన రిటర్న్ గిఫ్ట్ రేపటి రోజున కేటీఆర్ కి కేసీఆర్ కి కూడా రావొచ్చని, అందుకు కేటీఆర్ ఇప్పటి నుంచే జాగ్రత్త వహించాలంటూ కవిత కేటీఆర్ కి కేసీఆర్ కి గతంలో ఉచిత సలహాలు కూడా అందించారు.

ఈ కక్ష రాజకీయాలలో నేను నం. 1 అయితే మిగతా వారు నం.2, 3,4 అనే వరుసలో ఉంటారు అంటూ పరోక్షంగా కేటీఆర్ పై విచారణ పేరుతో జరగబోయే చర్యలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అయితే ఇక్కడ కవిత నెంబర్ 1 అయితే 2..కేటీఆర్, మరి 3, 4 లో కేసీఆర్ ఒకరైతే…మరి ఆ నాలుగు హరిషా.?

ఇప్పటికే బిఆర్ఎస్ లో కేసీఆర్ స్థానాన్ని పరోక్షంగా కేటీఆర్ అందిపుచ్చుకున్నారు, అందుకు తగ్గట్టే పార్టీ బరువు బాధ్యతలను తన భుజాన వేసుకుని పార్టీ గెలుపోటములతో తన కీలక పాత్రను పోషిస్తున్నారు. ఇక కవిత ఇప్పటికే పార్టీ నుండి బయటకు పంపబడ్డారు, ఇటువంటి సమయంలో కేటీఆర్ పై విచారణ అరెస్టు వరకు వెళితే ఇక బిఆర్ఎస్ లో కల్వకుంట్ల ఆధిపత్యం ఆవిరైపోయినట్టేనా.?

ఇప్పుడా ఊహే బిఆర్ఎస్ ను భయపెట్టబోతుంది, అలాగే గులాబీ సేనను కంగారులో ముంచబోతుంది. ఒకవేళ అదే జరిగితే బిఆర్ఎస్ ను నిలబెట్టేందుకు కేసీఆర్ తన మౌన దీక్షను విరమించి, అజ్ఞాతాన్ని వదిలి ప్రజాక్షేత్రంలోకి అడుగుపెడతారా.? లేక తన సేనాధిపతిగా హరీష్ ను ముందుకు పంపుతారా.?

ADVERTISEMENT
Latest Stories