టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ నిన్న మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ ఆయనకు అడుగడుగునా లభించిన స్వాగతం చూసినప్పుడు ఈ మూడేళ్లలో నియోజకవర్గంపై బాగానే పట్టు సాధించినట్లు కనబడుతోంది. ఇక ఆయన గ్రామస్తులతో చనువుగా మాట్లాడుతున్న తీరు చూస్తుంటే కుటుంబ సభ్యుడే పలకరిస్తున్నట్లుగా ఉంది తప్ప ఓ రాజకీయ నాయకుడు రాజకీయ కారణాలతో పలకరిస్తున్నట్లు లేదు.
గడప గడపకి కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామాలలో పర్యటించినప్పుడు ఎంత ఉద్రిక్తంగా సాగుతుంటాయో అందరూ చూస్తూనే ఉన్నారు. చివరికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జిల్లా పర్యటనలకు వచ్చినప్పుడు ఎక్కడికక్కడ బ్యారికేడ్లు, పరదాలు కట్టి, దుకాణాలు, స్కూళ్ళు మూసివేయిస్తుండటంతో కాస్త ఉద్రిక్త వాతావరణం కనిపిస్తుంటుంది. కానీ నారా లోకేష్ గ్రామాలలో పర్యటిస్తున్నప్పుడు ఎటువంటి హడావుడీ లేకుండా గ్రామస్తులలో ఒకరన్నట్లు తిరుగుతూ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూనే వైసీపీ ప్రభుత్వం పనితీరు గురించి వారినోటే చెప్పిస్తుండటం విశేషం.
నిన్న మంగళగిరిలో నారా లోకేష్ పర్యటిస్తున్నప్పుడు విజయసాయి రెడ్డి మొబైల్ ఫోన్ పోగొట్టుకోవడం గురించి మీడియాతో మాట్లాడిన తీరు చూసినప్పుడు, ఆయన భాషా నైపుణ్యం కూడా చాలా మెరుగుపడినట్లు అర్దం అవుతోంది. “ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉందంటే, అవినీతి కేసులలో ఏ-2, ఆ పార్టీ ఎంపీ, వైసీపీకి ప్రధాన కార్యదర్శిగా ఉన్న విజయసాయి రెడ్డి మొబైల్ ఫోనే ఎవరో దొంగిలించారంటే మన ఆంద్ర రాష్ట్రం పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. ఫోన్లు పోవడం పెద్ద విశేషం కాదు కానీ ఫోన్ పోతే ఆయన ఎందుకు అంత కంగారూ పడుతున్నారనేదే ప్రశ్న?దానిలో ఆయన చేసిన అవినీతి భాగోతాలు బయటపడతాయనా?లేదా వైజాగులో ఆయన చేసిన రాసలీలలు బయటపడతాయనా?లేదా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈయనగారి పాత్ర ఏమిటో బయటపడుతుందనే భయమా?
అందుకే ఇప్పుడు రాష్ట్ర డిజిపి మొదలు కానిస్టేబుల్ వరకు రాష్ట్రంలో పోలీసులు అందరూ విజయసాయి రెడ్డిగారి మొబైల్ ఫోన్ ఎక్కడుందో వెతికి కనిపెట్టేందుకు తిరుగుతున్నారు. విజయసాయి రెడ్డి ఫోన్ పోవడం అంటే దొంగాడి ఇంట్లో దొంగ పడినట్లుంది. కానీ ఆయన సమాజంలో అందరూ దొంగలే అన్నట్లు మాట్లాడుతుంటారు. ఆ ఫోన్‌లో ఎమ్మున్నాయో అన్ని బయటకి వస్తే మంచిది. ప్రజలకు కూడా ఏం జరుగుతోందో తెలియాలి కదా?” అని అన్నారు.



