అందరూ దోచుకోవడానికేనా తెలంగాణ ఏర్పడింది?

Is Telangana Being Looted After State Formation?

ఒకప్పుడు బ్రిటిష్ వారు మన దేశాన్ని దోచుకుంటున్నారని అనేకమంది ప్రాణాలు త్యాగం చేసి, అనేక పోరాటాలు చేసి దేశం నుంచి తరిమికొట్టారు. కానీ దోపిడీ ఆగిందా?

సమైక్య రాష్ట్రంలో ఆంధ్రా పాలకులు తెలంగాణని, ప్రజలను దోచుకుంటున్నారని కేసీఆర్‌ & కో వీరపోరాటాలు చేసి తెలంగాణ సాధించుకున్నారు. కానీ దోపిడీ ఆగిందా? అంటే రెండు ప్రశ్నలు కాదని ఒకటే సమాధానం.

ADVERTISEMENT

ఇప్పుడు దేశంలో దోపిడీ గురించి మాట్లాడుకుంటే అదో పెద్ద గ్రంధం అవుతుంది. కనుక తెలంగాణ గురించి మాత్రమే చెప్పుకుందాము.

కేసీఆర్‌ పదేళ్ళ పాలనలో తెలంగాణలో శరవేగంగా అభివృద్ధి జరిగిందన్న మాట వాస్తవం. అది కళ్ళకు కనిపిస్తోంది కూడా.

కానీ ఆ అభివృద్ది పేరుతో లక్షల కోట్లు దోచేసుకున్నారని కాంగ్రెస్‌, బిజేపిలు ఆరోపిస్తూనే ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్‌తో వ్యాపారులను, కాళేశ్వరం, యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ ప్లాంట్స్, విద్యుత్ కొనుగోలు, సచివాలయం, కలెక్టరేట్ కార్యాలయాల నిర్మాణం… ఇలా ప్రతీ పనితో వేలు, లక్షల కోట్లు కమీషన్లు బొక్కేశారని కాంగ్రెస్‌, బిజేపిలు ఆరోపిస్తూనే ఉన్నారు.

చివరికి కేసీఆర్‌ కుమార్తె కూడా కవిత కూడా తన తండ్రి హయంలో కమీషన్లు, అవినీతి, దోపిడీ వాస్తవమే అని రోజుకో కుండ బద్దలు కొడుతూనే ఉన్నారు. బీఆర్ఎస్‌ నేతల భూకబ్జాలకు లెక్కేలేదని కల్వకుంట్ల కవిత ఆరోపిస్తున్నారు.

తెలంగాణ ఏర్పడితే ప్రజల బ్రతుకులు బాగు పడతాయని కేసీఆర్‌ గట్టిగా నమ్మించారు. కానీ కేసీఆర్‌ కుటుంబం ఒక్కటే బాగుపడిందని కాంగ్రెస్‌, బిజేపిలు విమర్శిస్తున్నాయి. హరీష్‌ రావు, నవీన్ రావు ఇంట్లో బంగారం గుట్టలు, వందల ఎకరాలలో ఫామ్‌హౌసులు ఉంటే తెలంగాణ బాగుపడినట్లేనా? అని కల్వకుంట్ల కవిత ప్రశ్నిస్తున్నారు.

ఒక్క హైదరాబాద్‌లోనే వేలకోట్లు విలువగల వందల ఎకరాలు కబ్జాకి గురైతే వాటిని గుర్తించి విడిపించడానికే కాంగ్రెస్‌ ప్రభుత్వం ‘హైడ్రా’ని ఏర్పాటు చేయాల్సి వచ్చిందంటే దోపిడీ ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. .

సరే కేసీఆర్‌ హయంలో జరిగిన అవినీతి గతం గతః అని వదిలేసినా కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సింగరేణిలో ఏవిధంగా అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయో హరీష్‌ రావు ఈరోజు పెద్ద అవినీతి చిట్టా బయట పెట్టారు. సింగరేణిలో జిలెటిన్ స్టిక్స్ మొదలు సోలార్ పవర్ ప్లాంట్స్ వరకు ప్రతీచోట అవినీతి జరుగుతోందంటూ ఆ వివరాలు చదివి వినిపించారు.

ఓ వారం రోజులు వెనక్కు వెళితే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కధనంలో ఇద్దరు కాంగ్రెస్‌ మంత్రులు సింగరేణిలో రూ.1600 కోట్ల నైనీ కోల్ బ్లాక్స్ టెండర్లు దక్కించుకోవడానికి పోటీ పడ్డారనే కొత్త విషయం బయటపెట్టింది.

వారిద్దరి మద్యలో ఎన్టీవీ చౌదరి కూడా ఎంట్రీ ఇచ్చి ఆ గనులు దక్కే అవకాశం లేదని గ్రహించగానే మహిళా ఐఏఎస్ అధికారిణితో మంత్రిగారి రాసలీలలు అంటూ స్టోరీ వండి వార్చేశారని పేర్కొంది.

ఈ అవినీతి భాగోతాలన్నీ వింటున్నప్పుడు దీని కోసమేనా రాజకీయ నాయకులు, తెలంగాణ ప్రజలు పదేళ్ళు పోరాడింది? అని బాధ కలుగుతుంది.

తెలంగాణ ఏర్పడినా రాష్ట్రంలో రైతులు, నిరుపేదలు పరిస్థితిలో ఎటువంటి మార్పు రాలేదు. కానీ తెలంగాణ ప్రయోజనాలు, తెలంగాణ సెంటిమెంట్ పేరుతో రాజకీయాలు చేస్తున్నవారందరూ వందలు, వేల కోట్లకు పడగలెత్తారు.

నాడు ఆంధ్రా పాలకులు తెలంగాణని దోచుకున్నారని నిందించారు. కానీ ఇప్పుడు తెలంగాణని, ప్రజలని ఎవరు దోచుకుంటున్నారు? ఇందుకేనా తెలంగాణ ఏర్పడింది? ప్రజలు కూడా ఆలోచించాలి.

ADVERTISEMENT
Latest Stories