సోమవారం తాడేపల్లి సిఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వం అసమర్ధతను, ఓటమిని, వైఫల్యాలను అన్నిటినీ ప్రతిపక్షాలమీదకు తోసేయాలని ప్రయత్నించడం విస్మయం కలిగిస్తుంది. సిఎం జగన్మోహన్ రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ ముందస్తు ఎన్నికలు వస్తాయని, మంత్రివర్గంలో కొందరిని తొలగిస్తానని, వచ్చే ఎన్నికలలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్స్ లభించవని, 40 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్చులో ఉన్నారంటూ టిడిపి మనతో మైండ్ గేమ్స్ ఆడుతోందని అన్నారు. టిడిపి అనుకూల మీడియా పనిగట్టుకొని వైసీపీకి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తోందని సిఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. టిడిపి కుట్రలను, కుతంత్రాలను తమ ప్రభుత్వం నిరంతరం ఎదుర్కొంటూ ముందుకు సాగవలసివస్తోందని సిఎం జగన్ అన్నారు.
ప్రజలు ఏ పార్టీనైనా 5 ఏళ్ళు పరిపాలించమని అధికారం కట్టబెడుతుంటారు. కనుక ఈ నాలుగేళ్ళలో వైసీపీ రాజకీయాలు చేయకుండా కేవలం పరిపాలనకే పరిమితమై ఉండి ఉంటే, ముఖ్యమంత్రి చేస్తున్న ఈ ఆరోపణలను ప్రజలు కూడా నమ్మి ఉండేవారు. కానీ అధికారంలోకి వచ్చిన తొలిరోజు నుంచే అమరావతి నిర్మాణ పనులకు బ్రేక్ వేసి నిలిపివేసి, కూల్చివేతలు, సంస్థల పేర్ల మార్పులు, రంగుల మార్పులకే పరిమితమయ్యారు.
నేటికీ వైసీపీ ప్రభుత్వం టిడిపి నేతలను రాజకీయంగా వేధిస్తూనే ఉంది. వారిపై పోలీస్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. టిడిపితో సఖ్యతగా ఉంటున్నందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పట్ల సిఎం జగన్ మొదలు మంత్రులు, ఎమ్మెల్యేలు అనుచిత వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు.
నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేయబోతే దానిని పోలీసులతో అడ్డుకొనేందుకు ప్రయత్నించి 20కి పైగా కేసులు నమోదు చేశారు. చివరికి రాజధాని కోసం భూములిచ్చిన రైతులు అరసవెల్లికి పాదయాత్ర చేస్తుంటే వారినీ విడిచిపెట్టకుండా వైసీపీ ప్రభుత్వం వేధించింది. మంత్రులు, పార్టీ నేతలు, కార్యకర్తల చేత వారిని దారుణంగా అవమానించింది.
ప్రతిపక్షాల పట్ల ఇంత అనుచితంగా వ్యవహరిస్తున్నప్పుడు అవి తమ ప్రభుత్వం పట్ల గౌరవభావంతో మెలగాలని, తాము చెప్పిన్నట్లే నడుచుకోవాలని ఆశించడం అత్యాశే కదా?బంతిని గోడకేసి ఎంతగట్టిగా కొడితే అది అంతకంటే ఎక్కువ వేగంతో వెనక్కు తిరిగి వస్తుంటుంది. రాజకీయాలలో కూడా అంతే!
అధికారంలో ఉన్నవారు, ప్రతిపక్షాలను, ప్రజాస్వామ్యాన్ని, మీడియాని గౌరవిస్తున్నట్లయితే, ప్రతిపక్షాలు కూడా తప్పనిసరిగా హుందాగా వ్యవహరించాల్సి ఉంటుంది. కాదని అనుచితంగా వ్యవహరిస్తే ప్రజలే వాటికి తగినవిదంగా బుద్ధి చెపుతారు. కానీ అధికార పార్టీ ప్రజాస్వామ్యం, హుందాతనం, నైతికవిలువలను పక్కనపెట్టి ఓ మెట్టు దిగి ప్రతిపక్షాలను దెబ్బ తీసి సంతోషించాలనుకొంటున్నప్పుడు, అవి కూడా తమ మనుగడను కాపాడుకోవడం కోసం మరో రెండు మెట్లు దిగి అదే స్థాయిలో దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తుంటాయి. కనుక ఇది స్వయంకృతాపరాధ ఫలితమే అని చెప్పుకోవచ్చు. వాటి పట్ల అనుచితంగా వ్యవహరిస్తూ అవి తాము చెప్పిన్నట్లు నడుచుకోకపోతే తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నాయని ఆవేదన చెందడం చాలా హాస్యాస్పదంగా ఉంది.



