బుల్లితెరపై బాగా ప్రజాధరణ పొందిన ‘జబర్దస్త్’ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం అయిన కమెడియన్ పొట్టి రమేష్ ను పోలీసులు అరెస్ట్ చేసారు. విశాఖపట్టణంలోని గాజువాకలో గల సొంత ఇంటిలో రమేష్ భార్య త్రిపురాంభిక ఆత్మహత్య చేసుకోవడంతో, విచారణ నిమిత్తం రమేష్ ను పోలీసులు తీసుకెళ్ళారు. త్రిపురాంభిక మరణంపై భిన్న వాదనలు వినపడుతున్న నేపధ్యంలో, ఈ కేసులు అత్యంత ఆసక్తికరంగా మారింది.
‘తనకు, తన భార్యకు ఎలాంటి గొడవలు లేవని, ఇద్దరం బాగా ఉంటామని, ఎందుకు ఈ అఘాయిత్యానికి పాల్పడిందో తెలియడం లేదని’ రమేష్ చెప్తుండగా, త్రిపురాంభిక తల్లితండ్రులు మాత్రం ‘తమ బిడ్డ ఆత్మహత్య చేసుకునేటంత పిరికిది కాదని, అత్త ఆడపడుచుల వేధింపులు ఉన్నాయని, వారే హత్య చేసి ఆత్యహత్య కోణంలో చిత్రీకరిస్తున్నారని’ ఆరోపణలు చేస్తున్నారు. దీంతో రమేష్ తో పాటు అతని తల్లితండ్రులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
ఇదిలా ఉంటే, త్రిపురాంభిక సూసైడ్ నోట్ రాసిందా? లేదా? అన్న కోణంలో పోలీసులు ఇంటిలో సోదాలు నిర్వహిస్తున్నారు. అలాంటి నోట్ లు ఏమీ రాయలేదని రమేష్ తల్లి చెప్తుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. బహుశా సూసైడ్ నోట్ లభిస్తే గనుక, ఈ ఆత్మహత్యపై ఒక స్పష్టత వచ్చే అవకాశం కనపడుతోంది. త్రిపురాంభిక ఆత్మహత్య చేసుకున్న సమయంలో రమేష్ షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ లో ఉండగా, విషయం తెలుసుకుని హుటాహుటిన విశాఖ చేరుకున్నాడు.



