తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బొటాబొటి మెజార్టీతో అధికారంలోకి వచ్చినప్పుడు, కటినమైన నిర్ణయాలు అమలుచేయలేక డైవర్షన్ పాలిటిక్స్ చేసిందంటే నమ్మొచ్చు. అదే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి 10 మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలతో బలం పెరగగానే హైడ్రాతో ఆక్రమణలు కూల్చివేయిస్తున్నారు.
అంటే ఓ ప్రభుత్వం బలం ఉన్నప్పుడు లేనప్పుడు ఏవిదంగా వ్యవహరిస్తుందో అర్దం చేసుకోవచ్చు.
ఏపీలో టిడిపి కూటమి ప్రభుత్వానికి 175కి 165 మంది ఎమ్మెల్యేలున్నారు. అంటే తిరుగులేని మెజార్టీ, బలం ఉన్నాయన్న మాట!
అంతా భారీ మెజార్టీ ఉన్నప్పుడు సిఎం చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్ చేయాల్సిన అవసరమే లేదు. కానీ తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో చంద్రబాబు నాయుడు అదే చేస్తున్నారని జగన్ ఆరోపించారు.
చంద్రబాబు నాయుడు మామూలుగా పాలన చేసుకున్నా యావత్ దేశం దృష్టిని ఆకర్షించగలుగుతున్నారు. కనుక ఆయనకి డైవర్షన్ పాలిటిక్స్ చేయాల్సిన అవసరం ఏమిటి?
అంటే ఎన్నికల హామీలు అమలుచేయలేక… అని జగన్ వాదిస్తున్నారు. అయితే వంద రోజులలోనే కొన్ని హామీలను అమలుచేశారు. వచ్చే నెలలో వంటగ్యాస్ సిలిండర్ల హామీ అమలుచేస్తామని ప్రకటించారు.
సిఎం చంద్రబాబు నాయుడు జగన్‌లాగ ఓటు బ్యాంక్ పెంచుకోవడం కోసం అప్పులు చేసి సంక్షేమ పధకాలు అమలుచేస్తానని చెప్పలేదు. సంపద సృష్టించి చేస్తానని ముందే చెప్పారు.
వంద రోజులలోనే అన్ని హామీలు అమలుచేసేయాలని ప్రజలు కూడా పట్టుబట్టడం లేదు. కానీ ఆయనపై విమర్శలు చేసేందుకు జగన్ మాత్రమే వాటి గురించి మాట్లాడుతున్నారు.
తిరుమల లడ్డూ ప్రసాదం రిపోర్ట్ జూలై 17న వస్తే ఇంత వరకు ఎందుకు దాచిపెట్టారు? ఇప్పుడే ఎందుకు బయటపెట్టారు? అని జగన్ ప్రశ్న.
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టి అప్పటికి నెలరోజులే అయ్యింది. మొదటి రెండు నెలల్లో సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు ఎంత బిజీగా ఉన్నారో అందరూ చూశారు. ఆ తర్వాత వరదలు ముంచెత్తాయి.
అయినప్పటికీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే టీటీడీ ప్రక్షాళన మొదలుపెట్టారు కనుకనే ఈ విషయం ఇంత త్వరగా బయటపడింది. ఒకవేళ ఆయన కూడా చూసి చూడన్నట్లు ఊరుకుంటే ఈ అపచారం బయటపడేదా… నేటికీ ఇంకా కొనసాగుతూనే ఉండేది కదా?
రమణ దీక్షితులు తాజా వ్యాఖ్యలు, జగన్ అడిగిన ప్రతీ ప్రశ్నకు టీటీడీ ఈవో శ్యామలరావు చెప్పిన సమాధానాలు విన్నాక కూడా జగన్ డైవర్షన్ పాలిటిక్స్ అంటూ తాను చేసిన తప్పుని సిఎం చంద్రబాబు నాయుడు మీదకి తోసేసి సులువుగా తప్పించుకోగలనని అనుకుంటున్నారు. పైగా ప్రధాని నరేంద్రమోడీకి దీని గురించి లేఖ వ్రాస్తానని బెదిరిస్తుండటం సిగ్గుచేటు.
ఇక చివరిగా చెప్పుకోవలసిన విషయం… టిడిపి కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలనకు ఇలాంటి వివాదాలు అవసరమే లేదు. టిడిపి కూటమి ప్రభుత్వం చెప్పుకునేందుకు చాలా మంచి విషయాలే ఉన్నాయి.




