సురేఖ, చిన్నారెడ్డిలకు ఓ లెక్క.. రాజగోపాల్ రెడ్డికి మరో లెక్క?

Konda Surekha, Chinna Reddy Face Congress Action

తెలంగాణ కాంగ్రెస్‌… ఆ మాటకొస్తే యావత్ దేశంలో అన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్‌ పార్టీ పని తీరు, ఆలోచనా విధానం ఒకేలా ఉంటుంది. పార్టీలో లుకలుకలు, పదవుల కోసం అలకలు, తిరుగుబాట్లు, షోకాజ్ నోటీసుల విషయంలో కూడా ఇంత యూనిఫారంగా ఉండటం కాంగ్రెస్‌ పార్టీకే చెల్లు.

తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖ, మాజీ మంత్రి చిన్నారెడ్డి ఇద్దరిపై కటిన చర్యలు తీసుకోబోతున్నట్లు క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌ మల్లు రవి చెప్పారు.

ADVERTISEMENT

వారిరువురూ పార్టీ, ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగే విధంగా వ్యవహరించినందుకు చర్యలు తీసుకోబోతున్నట్లు మల్లు రవి చెప్పారు.

మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత సిఎం రేవంత్‌ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేసినందుకు, సురేఖను బాధ్యురాలిని చేస్తూ చర్యలు చేపట్టేందుకు కాంగ్రెస్‌ పార్టీ సిద్దమవుతున్నప్పుడు, అదే నియమం మంత్రి కోమటిరెడ్డి రెడ్డికి కూడా వర్తింపజేయాలి కదా?

ఆయన తమ్ముడు, మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఆశించి దక్కనందుకు తరచూ సిఎం రేవంత్‌ రెడ్డిపై, ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూనే ఉంటారు.

అందుకు కాంగ్రెస్‌ క్రమశిక్షణ కమిటీ ఆయనకు గత ఏడాదే షోకాజ్ నోటీస్ ఇచ్చింది కూడా. కానీ ఆయనపై ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకునే ధైర్యం చేయలేకపోయింది!

అలాగని మంత్రి కొండా సురేఖ ఇచ్చినట్లే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కూడా షోకాజ్ నోటీస్ ఇచ్చే సాహసం కూడా చేయలేకపోయింది!

కానీ పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎంత పెద్దవారైనా కటిన చర్యలు తప్పవని మల్లు రవి చిలక పలుకులు పలికారు. ఆ లెక్కన పార్టీని, సిఎం రేవంత్‌ రెడ్డిని ధిక్కరిస్తూ బహిరంగంగా విమర్శలు చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ముందుగా పార్టీలో నుంచి సస్పెండ్ చేయాల్సి ఉంటుంది.

కానీ త్వరలో జరుగబోయే మంత్రివర్గ విస్తరణలో ఆయనకి మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అవి నిజమే అయితే కాంగ్రెస్‌ అధిష్టానం, తన పార్టీ నేతలతో కూడా ద్వంద వైఖరి అవలభిస్తుందని స్వయంగా నిరూపించుకున్నట్లే అవుతుంది. ఇలాగే జరిగితే అప్పుడు కొండా సురేఖ, చిన్నారెడ్డి కాంగ్రెస్‌ అధిష్టానాన్ని నిలదీయకుండా ఉంటారా?

ADVERTISEMENT
Latest Stories