నేటికీ దేశంలో లక్షలాది మంది విద్యార్ధులు ఐఏఎస్, ఐపీఎస్ అయ్యేందుకు రేయింబవళ్ళు కష్టపడి చదవుతుంటారు. వాటిలో అర్హత సాధించినా ఐఏఎస్, ఐపీఎస్ శిక్షణ కూడా అంత తేలిక కాదు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా వారు ప్రతీరోజూ తమ సమర్ధత నిరూపించుకుంటూనే ఉండాలి.
అలాంటి పరీక్షలను వారు ముందే ఎదుర్కొన్నారు కనుక, చాలా మంది ప్రభుత్వం తమకి ఎటువంటి బాధ్యతలు అప్పగించినా సమర్ధంగా చేసి ప్రశంశలు పొందుతారు.
కానీ అంత సమర్ధులైన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులలో కొందరు రాజకీయ నాయకుల చేతిలో కీలుబొమ్మలుగా మారి, వారి కోసం చేయకూడని తప్పులన్నీ చేస్తుంటారు.
వారి చేత తప్పులు చేయించిన అధికార పార్టీ నాయకులకు రాజకీయ రక్షణ కవచాలు ఉంటాయి. కనుక వారు చాలా సులువుగా తప్పించుకోగలరు. కానీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు తప్పించుకోలేరు.
సమాజంలో ఎంతో గౌరవమర్యాదలు అందుకోవాల్సిన వారు ఐపీఎస్ అధికారి పి. సీతారామాంజనేయులులా ఉద్యోగంలో నుంచి సస్పెండ్ అవుతారు. రెండేళ్ళుగా సస్పెన్షన్‌లో ఉన్న అయన అదే స్థితిలో ఈ నెలాఖరున పదవీ విరమణ చేయబోతున్నారు!
సీనియర్ ఐపీఎస్ అధికారి అయ్యుండి ఆయన గ్రూప్-1 పరీక్షల మూల్యాంకనంలో అవకతవకల కేసులో, మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో, బాలీవుడ్ నటి కాదంబరీ జేత్వానీని వేధింపుల కేసులలో చిక్కుకున్నారు. ప్రభుత్వం మారగానే అందుకు సస్పెండ్ అయ్యారు. సస్పెన్షన్‌లో ఉండగానే పదవీ విరమణ చేయనున్నారు. ఇవన్నీ అవమానకరమే కదా?
చివరికి పదవీ విరమణ చేసిన తర్వాత కూడా ప్రశాంతంగా జీవించలేని దుస్థితి. ఈ కేసులలో కోర్టుల చుట్టూ తిరగక తప్పదు. ఎంతగానో కష్టపడి ఐఏఎస్, ఐపీఎస్ అయితే, చివరికి ఇలా అవమానకర ముగింపు బాధాకరమే! కానీ ఎందువల్ల? అని ఆలోచిస్తే సమాధానం అందరికీ తెలుసు.





