తెలంగాణ ముస్లింల జనాభా చాలా ఎక్కువ కనుక వారిని ప్రసన్నం చేసుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు ఏవో ప్రయత్నాలు చేస్తూనే ఉంటాయి.
తెలంగాణతో పోలిస్తే ఆంధ్రాలో ముస్లిం జనాభా చాలా తక్కువ. కులాల ప్రభావం చాలా ఎక్కువ. కనుక అన్ని పార్టీలు కుల సమీకరణాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటాయి. అలాగని ముస్లిం ఓటర్లని విస్మరించలేవు కనుక వారినీ ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉంటాయి.
నేడు మోడీ ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెడుతున్న వక్ఫ్ బిల్లుకి వ్యతిరేకంగా ఓట్లు వేస్తామని వైసీపీ చెప్పడానికి కారణం అదే.
ఈ విషయంలో టీడీపీ, జనసేనలు ఆ బిల్లుకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించాయి కనుక ముస్లింల ఆగ్రహాన్ని భరించేందుకు సిద్దపడ్డాయని అనుకోవచ్చు. అయితే ముస్లింల ప్రయోజనాల కంటే రాష్ట్రం ప్రయోజనాలు ముఖ్యం అని భావించడం వల్లనే అవి అందుకు సిద్దపడిన్నట్లు భావించవచ్చు.
మోడీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ బిల్లుని పార్లమెంటులో ప్రతిపక్షాలన్నీ ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నందున, ఇటువంటి కీలక సమయంలో ఎన్డీఏలో విశ్వసనీయమైన భాగస్వామిగా మోడీ ప్రభుత్వానికి మద్దతు ఈయడం మంచి నిర్ణయమే.. దానికి తగిన ప్రతిఫలం రాష్ట్రానికి తప్పక లభిస్తుంది.
ఇక ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా ఈ బిల్లుని వ్యతిరేకిస్తూ ట్వీట్ చేశారు. దేశంలో మైనార్టీలను అణచివేసేందుకు మోడీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలో భాగంగానే ఈ బిల్లుని తెస్తోందని, కనుక ఈరోజు దేశానికి బ్లాక్ డే అని అన్నారు. టీడీపీ, జనసేనలు ఈ బిల్లుకి మద్దతు పలకడం చాలా దారుణమని వైఎస్ షర్మిల విమర్శించారు. ఈ బిల్లుని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకయిస్తోంది కనుకనే ఆమె కూడా వ్యతిరేకిస్తున్నారు.
ఈ బిల్లుతో దేశంలో హిందూ ఓటర్లను తమవైపు తిప్పుకోవచ్చని బీజేపి భావిస్తుండవచ్చు. దీనిని వ్యతిరేకించడం ద్వారా ముస్లిం ఓటర్లను తమ వైపు తిప్పుకోవచ్చని ఇతర పార్టీలు ఆశపడుతున్నాయి. కనుక వక్ఫ్ బిల్లు విషయంలో అన్ని పార్టీలు దేని రాజకీయ ప్రయోజనాలు అవి చూసుకుంటున్నాయే తప్ప తమపై ప్రేమతోనో ద్వేషంతోనో కానే కాదని ముస్లింలు కూడా గ్రహించడం చాలా అవసరం.
ఆస్తుల కోసం కీచులాడుకొంటున్న జగన్, షర్మిల ఈ ఒక్క విషయంలో ఓకే పాట పాడటమే ఇందుకు చక్కటి నిదర్శనం కాదా?




