జగన్ పై విజయవాడలో జరిగిన రాయి దాడి ఘటనలో అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అయితే ఆ దాడి వెనుక చంద్రబాబు నాయుడు హస్తం ఉందని, ముఖ్యమంత్రి జగన్ పై హత్యాయత్నం జరిగిందంటూ వైకాపా నేతలు ఆ నేరం మొత్తం బాబు పైన నెట్టే ప్రయత్నం చేసారు.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వైకాపా నేతల ఆరోపణలు తిప్పికొడుతూ గతంలో బాబు పై వైసీపీ నేతలు చేసిన రాళ్ల దాడిని, దానిని సమర్థిస్తూ వైకాపా నాయకులు చేసిన విమర్శలను ప్రజల దృష్టికి తీసుకువచ్చారు. అలాగే 2019 ఎన్నికల ముందు కూడా జగన్ పై ఇదే తరహా దాడి జరగడంతో ఇదంతా ఐప్యాక్ స్క్రిప్ట్ లో భాగమే అంటూ, డ్రామాలు వారు చేసి నేరస్తులు అనే బిరుదులు వారి ప్రత్యర్థుల ఖాతాలో వేయడం వైసీపీ కి అలవాటుగా మారిపోయిందని వైసీపీ చేసిన ఆరోపణలను బాబు, పవన్ లు బలంగా తిప్పికొట్టారు.
ఇప్పుడు దాడి చేసినట్లు అనుమానిస్తున్న సతీష్ అనే వ్యక్తిని పట్టుకున్నారు కాబట్టి ఉన్నత అధికారులు సమగ్ర విచారం తరువాత ఆ దాడికి గల కారణాలను బయటపెట్టాల్సి ఉంటుంది. అయితే కొన్నిమీడియా కథనాల ప్రకారం ఆ దాడి కి పాల్పడిన వ్యక్తికీ ఒక క్యార్టర్ మందు బాటిల్, 350 కాష్ ఇస్తామని చెప్పి జగన్ మేమంతా సభకు తీసుకు వచ్చారని, ఆ ఒప్పందంలో భాగంగా సదరు వ్యక్తికీ క్యార్టర్ మందు బాటిల్ దక్కింది కానీ, ఇస్తామన్న 350 నగదు చేతికి అందలేదట.
అందుకు నిరసనగా ఆ మద్యం మత్తులో సతీష్ అనే వ్యక్తి జగన్ పైకి రాయి వేసినట్లు కొన్ని మీడియా ఛానెల్స్ లో కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఒక వేళ అదే నిజమైతే వైసీపీ చంద్రబాబు పై చేసిన ఆరోపణలు అవాస్తవమని ఒప్పుకోవాల్సిందే, అలాచేస్తే తమ పార్టీ మైలేజ్ కోసం ఎటువంటి ఆధారాలు లేకుండా బాబు పై నిందలు వేశారు అనే అపవాదును మూటకట్టుకోవాలి. దీనికి తోడు ఇప్పటి వరకు టీడీపీ పైన బాబు పైన చేసిన ఆరోపణలని అవాస్తవాలని తేలిపోతుంది.
అంతేకాదు ఇన్నాళ్లుగా జగన్ పాలన నచ్చి జగన్ కు మద్దతుగా జగన్ సభలకు స్వచ్ఛందంగా ప్రజలు తరలి వస్తున్నారు అంటూ వైసీపీ చేస్తున్న ప్రచారాలలో వాస్తవం లేదు అనేది ప్రజలకు స్పష్టమవుతుంది. అందువల్ల ఈ దాడి ఘటన పట్ల వైసీపీ చాల జాగ్రత్తగా ఆచితూచి మాట వదలాల్సి ఉంటుంది. అదలా ఉంటే ఒకపక్క టీడీపీ నేత లోకేష్ తన సోషల్ మీడియాలో క్యార్టర్ ఇచ్చి, ఇస్తానన్న 350 నగదు ఇవ్వకపోతే మండదా అక్కా.., మండదా చెల్లీ…, మండదా తమ్ముడు అంటూ జగన్ కు కౌంటర్ వేశారు.
అయితే జగన్ మీద జరిగింది అసలు రాయి దాడి కాదు గజమాలకు ఉన్న తీగేదో గుచ్చుకుని గాయం అయిందని, వీడియో లో చూసిన దృశ్యాల బట్టి మాల వేసి తీసే లోపు గాయం జరగడం, ఆసమయంలో కరెంట్ పోవడం అన్ని పరిశీలిస్తే ఇది రాయి దాడి కాదు పూలమాల దెబ్బ అంటూ టీడీపీ నేత వార్ల రామయ్య మరో కథనంతో మీడియా ముందుకు వచ్చారు. జగన్ కు జరిగిన చిన్న గాయానికి వైద్యులు పెద్ద వేద్యమే చేసారంటూ ఎద్దేవా చేసారు.
ఏదిఏమైనట్టప్పటికీ గాయం జరిగిన మాట వాస్తవం, అది టీడీపీ నేతలు ఆరోపిస్తున్నట్లు వైసీపీ స్క్రిప్ట్ లో భాగమా, లేక పూలమాల వల్ల తగిలిన గాయమా, లేక వైసీపీ నిందిస్తున్నట్లు ప్రతిపక్షంలో ఉన్న బాబు ప్రణాళికా, లేక మీడియా ప్రచారం చేస్తున్నట్లు 350 రూ. కోసం క్యార్టర్ తాగిన వ్యక్తి చేసిన చర్యా అనేది ఈ ఎన్నికల నాటికీ తెలచాల్సిన బాధ్యత ఉన్నతాధికారులదే. ఇలా ఒక్క దాడి వెనుక ఎన్నో అనుమానాలు, మరెన్నో కథనాలు ప్రచారంలో ఉన్న నేపథ్యంలో ప్రజలు ఏది నమ్మారో అన్నది ఎన్నికల ఫలితాల తరువాత వచ్చే ప్రజాతీర్పుతో తేలిపోతుంది.






