‘గత ఎన్నికలలో వాడు గెలిపించాడు… వీడు గెలిపించాడు… అంటారేంటి…’ అంటూ ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన మద్దతుపై కీలక వ్యాఖ్యలు చేసిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రాజకీయ వర్గాల్లో అలజడి సృష్టించారు. పవన్ ఎలాంటి వ్యాఖ్యలు చేసినా ‘సానుకూల’ దృక్పధంతో తీసుకుంటున్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆలోచనలకు విరుద్ధంగా చింతమనేని వ్యాఖ్యలు ఉండడంతో పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు రోడ్డెక్కారు.
“పవన్ కల్యాణ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చౌదరి తక్షణం క్షమాపణలు చెప్పాలని’ డిమాండ్ చేస్తూ, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్ వద్ద ‘జనసేన’ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ప్లకార్డులతో ధర్నాకు దిగిన ‘జనసేన’ అభిమానులు, చింతమనేని క్షమాపణలు చెప్పకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని” హెచ్చరికలు జారీచేసారు. స్తబ్దుగా ఉన్న రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించే విధంగా ఉన్న చింతమనేని వ్యాఖ్యలపై చంద్రబాబు సీరియస్ అయ్యే సంకేతాలు కనపడుతున్నాయని పొలిటికల్ వర్గాల టాక్.



