జనసేనాని పవన్ కళ్యాణ్ ఆదివారం పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళలో 210 కౌలు రైతుల కుటుంబాలకి రూ. లక్ష చొప్పున ఆర్ధికసాయం అందజేశారు. ఈ సందర్భంగా అక్కడ జరిగిన బహిరంగసభలో పవన్ కళ్యాణ్ ప్రజలని, తన పార్టీ కార్యకర్తలని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “నను వీకెండ్ పొలిటీషియన్ అని వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. నేను వారానికి ఒక్కసారి వస్తేనే తట్టుకోలేకపోతున్నారు. అదే నేను రోజూ రాష్ట్రంలో తిరిగితే తట్టుకోగలరా?నేను వారాహి వాహనంలోనే రాష్ట్రంలో పర్యటిస్తాను. ఎవరు అడ్డుకొంటారో నేను చూస్తాను. వారాహిని టచ్ చేసి చూడామని వైసీపీ నేతలకి సవాల్ విసురుతున్నాను,” అని అన్నారు.
“బీసీలకి జనాభా ప్రతిపదికన రాజ్యాధికారం కల్పించడమే మా పార్టీ లక్ష్యం. మేము ఉత్తరాంద్రలో తూర్పు కాపుల సమస్యలని తెలుసుకొని వారిని ఏకం చేయడానికి సమావేశాలు నిర్వహిస్తే, వైసీపీ హడావుడిగా విజయవాడలో ‘జయహో బీసీ సభ’ నిర్వహించి ఆ సభకి వచ్చినవారికి చేపల కూర, రొయ్యల పులుసు పెట్టామని గొప్పగా చెప్పుకొంది. బీసీలకి కావలసింది బిర్యానీ ప్యాకెట్లు… రొయ్యల కూర కావు. రాజ్యాధికారంలో భాగం! కానీ మీరెంతమంది ఉన్నా అధికారం, పెత్తనం మేమే చేస్తామంటుంది వైసీపీ. కనుక బీసీలు వైసీపీకి ఓటు బ్యాంకుగా మిగిలిపోకుండా తమకి రాజ్యాధికారం కల్పించడం కోసం పోరాడుతున్న జనసేనకి మద్దతు ఇవ్వాలి,” అని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు.
పొత్తులపై వైసీపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారానికి కూడా నిన్నటి సభలో పవన్ కళ్యాణ్ గట్టి సమాధానం ఇచ్చారు. “2014లో ఏర్పడిన మా కూటమి అలాగే బలంగా నిలిచి ఉండి ఉంటే రాష్ట్రంలో వైసీపీ ఎన్నటికీ అధికారంలోకి రాగలిగేది కాదు. వైసీపీ అధికారంలోకి రావడంతో రాష్ట్రంలో సర్వనాశనం అయిపోయింది. ఒకవేళ వైసీపీ మళ్ళీ అధికారంలో వస్తే ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భవిష్యత్ అంధకారం అయిపోతుంది. కనుక ఎట్టి పరిస్థితులలో వైసీపీ మళ్ళీ అధికారంలోకి రాకుండా అడ్డుకొంటాను. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా చూస్తాను. అయితే బీసీలతో సహా ప్రజలందరూ కూడా పార్టీల మద్య చీలిపోకుండా ఈ పోరాటంలో మాకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నాను. టిడిపి లేదా బిజెపికో అమ్ముడుపోవలసిన ఖర్మ మాకు పట్టలేదు. వైసీపీ వచ్చే ఎన్నికల గురించి మాత్రమే ఆలోచిస్తుంటే మేము రాబోయే రెండు తరాల గురించి ఆలోచిస్తున్నాము. అదే మాకు వైసీపీకి తేడా,” అని అన్నారు.
“మాచర్లలో జరిగిన గొడవలు, విధ్వంసం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, “ఒకప్పుడు ఒక ప్రాంతానికే పరిమితమైన ఫ్యాక్షన్ గొడవలు ఇప్పుడు అన్ని జిల్లాలకి వ్యాపిస్తున్నాయి. కోనసీమ, మాచెర్లలలో జరిగిన గొడవలే ఇందుకు నిదర్శనం. ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారిని, వైసీపీకి పోటీగా ఎదుగుతున్నారనుకొనేవారిని ఏవిదంగా అణగద్రొక్కుతుందో మాచర్ల ఘటనలు ఒక తాజా ఉదాహరణ. కనుక రాష్ట్రంలో జనసేన కార్యకర్తలకి కూడా ఇటువంటి చేదు అనుభవాలు ఎదుర్కోవలసిరావచ్చు. వాటికి భయపడకుండా వైసీపీ అరాచకాలను ధైర్యంగా ఎదుర్కొని పోరాడవలసి ఉంటుంది. ఈ క్రమంలో పోలీసులతో వేధింపులకి, కేసులకి, చివరికి జైలుకి వెళ్ళవలసి వచ్చినా భయపడకూడదు. అప్పుడే వైసీపీని మళ్ళీ అధికారంలోకి రాకుండా అడ్డుకోగలుగుతాము,” అని పవన్ కళ్యాణ్ అన్నారు.



