జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బుదవారం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. అకాలవర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను కలిసి తడిసిన ధాన్యం, పంట నష్టం గురించి అడిగి తెలుసుకొంటున్నారు. ప్రభుత్వం నుంచి ఏమైనా సాయం అందుతోందా లేదా అని అడిగితెలుసుకొని వారిని ఓదార్చి, నష్టపరిహారం చెల్లింపుకోసం ప్రభుత్వంపై జనసేన పార్టీ ఒత్తిడి చేస్తుందని ధైర్యం చెపుతూ పవన్ కళ్యాణ్ ముందుకు సాగుతున్నారు.
ఇదివరకు మచిలీపట్నంలో జనసేన ఆవిర్భావ దినోత్సవానికి వచ్చినప్పుడు, పవన్ కళ్యాణ్ మిలటరీ యూనిఫారంను పోలిన దుస్తులు, బూట్లు వేసుకొని వచ్చారు. మర్నాడు తన వారాహి ప్రచార వాహనంలో సభావేదిక వద్దకు చేరుకొన్నారు. అయితే ఈసారి తెల్లటి దుస్తులు ధరించి నిరాడంబరంగా ఓపెన్ టాప్ కారులో ప్రయాణిస్తున్నారు. అభిమానులు జనసేన జండాలు చేతపట్టుకొని కార్లు, బైకులపై అనుసరిస్తుండగా పవన్ కళ్యాణ్ కారులో ప్రయాణిస్తూ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు.
కోట్లు ఖర్చు చేసి ముచ్చటపడి తయారుచేయించుకొన్న వారాహి వాహనాన్ని షెడ్‌లో ఎందుకు పెట్టేశారు?వారాహి ఉండగా పవన్ కళ్యాణ్ కారులో ఎందుకు ప్రయాణిస్తున్నారనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. దానిని ఏపీలో రోడ్లపై తిరిగేందుకు వైసీపీ ప్రభుత్వం అనుమతి నిరాకరిస్తోందా లేక కేవలం ఎన్నికల ప్రచారం కోసమే వినియోగించాలనుకొంటున్నారా లేక మరేదైనా బలమైన రాజకీయ కారణం ఉందా?అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. వారాహి గురించి రాజకీయ ప్రత్యర్దులు ఏవేవో ఆరోపణలు చేస్తున్నా జనసేన జవాబు చెప్పకుండా మౌనంగా ఉండిపోవడంతో ఊహాగానాలకు అవకాశం కల్పించినట్లవుతోంది కదా?



