టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు 2022 సంవత్సరానికి ఉత్తమ కొరియోగ్రాఫర్ జాతీయ అవార్డుకి ఎంపికైన సంగతి తెలిసిందే. సాధారణంగా ఇటువంటి ప్రతిష్టాత్మకమైన అవార్డుకి ఎంపికైన వారి పేర్లు మారుమ్రోగిపోతుంటాయి. ఇంటర్వ్యూల కోసం మీడియా వారి వెంటబడుతూ ఉండేది.
కానీ ఈ అవార్డు ప్రకటించక ముందే అత్యాచారం, లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ అరెస్ట్ అవడంతో దేశవ్యాప్తంగా ఆయన పేరు మారుమ్రోగిపోయింది.
సినీ పరిశ్రమలో ప్రతీ ఒక్కరూ జాతీయ అవార్డుల కోసం ఎంతగానో ఆశపడుతుంటారు. అటువంటి ప్రతిష్టాత్మకమైన జాతీయ అవార్డు జానీ మాస్టర్‌కి దక్కింది. కనుక ఢిల్లీ వెళ్ళి ఈ అవార్డుని స్వీకరించేందుకు ఆయన తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించి మూడు రోజులు మద్యంతర బెయిల్ పొందారు కూడా.
నేడు జైలు నుంచి బయటకు వచ్చి ఢిల్లీ బయలుదేరేందుకు సిద్దమవుతుంటే, జాతీయ అవార్డుల కమిటీ ఆయనకు పెద్ద షాక్ ఇచ్చింది.
ఈ కేసు నేపధ్యంలో ఆయనకు పంపిన ఆహ్వానాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అంటే మంగళవారం ఢిల్లీలో జరిగే జాతీయ అవార్డుల ప్రధానోత్సవానికి రానవసరం లేదని, ఆయనకు ఈ అవార్డు ఇవ్వబోవడం లేదని స్పష్టం చేసింది.
ఇటువంటి హేయమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్‌కి ఈ అవార్డు ప్రధానం చేసి ఉండి ఉంటే ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపిన్నట్లవుతుందని ముందే చెప్పుకున్నాము.
అలాగే ఇటువంటి తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటూ జైల్లో ఉన్న జానీ మాస్టర్ బెయిల్ తీసుకోవడం, ఢిల్లీకి బయలుదేరుతుండటం రెండూ సరికాదని ముందే చెప్పుకున్నాము.
ఆయన నిసిగ్గుగా ఢిల్లీకి బయలుదేరేందుకు సిద్దమైనప్పటికీ జాతీయ అవార్డుల కమిటీ సకాలంలో చాలా సరైన నిర్ణయమే తీసుకుందని చెప్పొచ్చు.
ఒకవేళ ఈ కేసులో జానీ మాస్టర్ నిర్ధోషిగా బయటపడితే అప్పుడు సగర్వంగా ప్రతిష్టాత్మకమైన ఈ జాతీయ అవార్డుని అందుకోవచ్చు. కానీ దోషిగా నిరూపించబడితే ఈ అవార్డుకి ఆయన అర్హత కోల్పోతారు.
జానీ మాస్టర్ ఢిల్లీకి రానవసరం లేదని స్పష్టమైంది కనుక ఆయన మద్యంతర బెయిల్ కూడా ఆటోమేటిక్‌గా రద్దు అయ్యే అవకాశం ఉంది.




