తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చెన్నై అపోలో ఆసుపత్రిలో డిసెంబర్ 5న కన్నుమూయగా, ఇప్పటికీ ఆమె మరణానికి కారణాలపై అనుమానాలు, సందేహాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో డిసెంబర్ 7న అంటే, జయ చనిపోయిన తరువాత రెండు రోజులకు తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావు, హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు జయలలిత మరణానికి గల కారణాలపై రాసిన లేఖ ఇప్పుడు సమాచార హక్కు చట్టం కింద వెలుగులోకి వచ్చింది.
డిసెంబర్ 4న తాను ముంబైలో ఉండగా, జయలలిత ఆరోగ్య పరిస్థితి మరింతగా విషమించినట్టు సమాచారం అందిందని, మెరుగైన వైద్యం అందించాలని తాను సూచించానని, ఎక్మో విధానంలో శ్వాస అందించినప్పటికీ, ఊపిరితిత్తులు పూర్తిగా పాడైపోవడమే ఆమె మృతికి కారణమైందని తెలిపారు. మొదట్లో ఆమె ఆరోగ్యం మెరుగు పడిందని, కోలుకున్న తరువాత తిరిగి మందగించిందని ఈ లేఖలో వెల్లడించడంతో, విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఇదంతా నిజమే అంటారా…?! అంటూ ప్రశ్నలు వేయడం నెటిజన్ల వంతవుతోంది.



