ముఖ్యమంత్రి చంద్రబాబు సమర్థతను చూసే తాను తెలుగుదేశం పార్టీలో చేరానని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. అభివృద్ధి విషయంలో చంద్రబాబును మించిన వారు లేరని, రాయలసీమను రతనాలసీమగా మార్చడంలో చంద్రబాబు సఫలమవుతారని చెప్పారు. పట్టిసీమ ప్రాజెక్టును అడ్డుకోవడం వైసీపీ అధినేత జగన్ అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని, కులం కూడు పెట్టదని… కులాల పిచ్చిని జనాలు విడనాడాలని పిలుపునిచ్చారు.
కేవలం కులాభిమానంతోనే రెడ్లంతా జగన్ వెంట నడిచారని… అంతకు మించి మరే కారణం లేదని, కులాలను పక్కన పెట్టి, అభివృద్ధిని చూసి ఓటు వేయడం నేర్చుకోవాలని, ఇప్పుడు పెళ్లిళ్లకే అడ్డులేవని కులం, ఓట్లేసేటప్పుడు మాత్రం ఎందుకని ప్రశ్నించారు. జగన్ ను ‘వాడు’ అని సంభోదించడానికి కారణం ఏంటంటే… వాడు మావాడని, వాడిని చిన్నపిల్లడప్పటి నుంచి చూస్తున్నానని, అందుకే జగన్ ను వాడు అంటానని అన్నారు.
అయినా ‘తిక్కముండా కొడుకు’ కాకపోతే జగన్ ఏం మాట్లాడుతాడు? ఎంత సేపూ తిట్లేనా? పోలవరం మీద ఎందుకు విమర్శలు చేస్తాడని, అసలు రాయలసీమకు ఏం కావాలో జగన్ అడగాలి కానీ విమర్శలు ఎందుకు? విమర్శల వల్ల ఏమొస్తుంది? ఇప్పుడు ప్రజలు కూడా మారుతున్నారని, 2019లో కూడా చంద్రబాబును మళ్ళీ గెలిపిస్తేనే రాష్ట్రాభివృద్ధి సంపూర్ణమవుతుందని అన్నారు.



