కొత్త నీరు వస్తే పాత నీరు బయటకు పోవాల్సిందే. రాజకీయ పార్టీలతో సహా అన్ని రంగాలలో ఇలాగే జరుగుతుంటుంది. రాజకీయ పార్టీలలో కొన్నిసార్లు బయటకు పోయేవారి విమర్శలు, మనోవేదనకు అర్దమున్నా వాటికి విలువ ఉండదు… వేరే పార్టీలో చేరి ఎదురుదాడి చేస్తే తప్ప!
తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి నేడు పార్టీకి రాజీనామా చేశారు. తాను కాంగ్రెస్ అధిష్టానం మొదలు రాష్ట్ర నాయకుల వరకు పార్టీ గాడి తప్పుతోందని పదేపదే చెప్పినా ఎవరూ పట్టించుకాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేసిన తన వంటివారిని కాదని, ఇతర పార్టీల నుంచి తెచ్చుకున్నవారికి ప్రాధాన్యం ఇవ్వడం, వారు గాంధీ భవన్‌లో సమావేశాలకు హాజరవుతుండటం తాను జీర్ణించుకోలేక చాలా బాధతో పార్టీకి రాజీనామా చేస్తున్నానని జీవన్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.
ఓ కుటుంబంలో తల్లితండ్రులు-పిల్లల మద్యనే జనరేషన్ గ్యాప్ కారణంగా అపార్ధాలు, ఆవేశాలు కనిపిస్తున్నప్పుడు జాతీయపార్టీ కాంగ్రెస్‌లో ఉండవా?అంటే తప్పకుండా ఉంటాయాని జీవన్ రెడ్డి రాజీనామాతో నిరూపితమైంది.
తల్లి తండ్రులు, పిల్లలు ఒకరి ఆలోచనలను, అభిప్రాయాలను మరొకరు అర్థం చేసుకోలేకపోతున్నప్పుడు, అంగీకరించలేకపోతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన కొత్తవారి తీరుని జీవన్ రెడ్డి వంటి సీనియర్లు జీర్ణించుకోవడం కష్టమే.
కాంగ్రెస్ పార్టీ విధానాలకు, సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయాలని జీవన్ రెడ్డి కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలో నిలబెట్టడమే ముఖ్యమని కొత్త తరం అనుకుంటోంది. రెండూ సరైనవే.
కానీ వాస్తవిక దృక్పదంతో ఆలోచిస్తే రెండోదే సరైనది. పదవీ, అధికారం లేకపోతే రాజకీయ నాయకుడిగా గుర్తింపు నిలుపుకోవడం కోసం కూడా నానాపాట్లు పడాల్సి ఉంటుంది. మరి పార్టీని ఎలా కాపాడగలరు?
రాజీనామా చేసిన వెంటనే అనుచరులతో మాట్లాడుతూ, “రేవంత్ రెడ్డి చేత అణగ దొక్కించుకోవడం కంటే ఎదురు తిరిగి పోరాడటమే మంచిదని తన భవిష్య కార్యాచరణను వెల్లడించారు. జీవన్ రెడ్డి వేరే పార్టీలో చేరినా ఈ 2.0 రాజకీయాలలో ఇమడలేరు. కనుక రాజకీయాల నుంచి రిటైర్ అవడమే మంచిది. కానీ ఒకసారి మొహానికి రంగేసుకున్న సినీ నటులు జీవితాంతం నటిస్తూనే ఉండాలని కోరుకున్నట్లే జీవన్ రెడ్డి కూడా 2.0 వెర్షన్‌కి సిద్ధమవుతున్నారు. దానిలో ఆశించిన గౌరవ మర్యాదలు లభిస్తాయా? డౌటే!




