టిడిపి కార్యాలయం, చంద్రబాబు నాయుడు నివాసంపై దాడి కేసులో పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉండటంతో మాజీ మంత్రి జోగి రమేష్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుని ఆశ్రయించగా అక్కడ ఉపశమనం లభించలేదు. కనుక వెంటనే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు ఆయన పిటిషన్ స్వీకరించింది కానీ ఇంకా విచారణ చేపట్టలేదు. దీంతో ఆయన టెన్షన్‌లో ఉన్నారు.
ఓ పక్క జోగి రమేష్ ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టు చుట్టూ తిరుగుతుంటే, అగ్రిగోల్డ్ భూముల కేసులో నిందితుడుగా ఉన్న ఆయన కుమారుడు జోగి రాజీవ్ బెయిల్ రద్దు చేయాలంటూ ఏసీబీ అధికారులు నేడు హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టు ఆ పిటిషన్ విచారణకు స్వీకరించి జోగి రాజీవ్‌కి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ నోటీసు పంపింది.
అంటే తండ్రీ సుప్రీంకోర్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తుంటే, కొడుకు హైకోర్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయక తప్పదన్న మాట! మంత్రిగా ఉన్నప్పుడు జోగి రమేష్, ఆయన కుమారుడు జోగి రాజీవ్ తమకు ఎదురే లేదన్నట్లు రెచ్చిపోయారు.
కానీ వైసీపి అధికారం కోల్పోగానే వారిద్దరి పరిస్థితి తారుమారై బెయిల్ కోసం కోర్టుల చుట్టూ ప్రదక్షిణాలు చేయాల్సివస్తోంది. అయితే జోగీ జోగీ రాసుకుంటే బూడిద రాలిన్నట్లు ఇప్పుడు ఎంతగా ప్రయత్నించినా ఫలితం ఉండకపోవచ్చు… ఏదోరోజు పోలీసులు అరెస్ట్ చేయక మానరు.
వైసీపి నేతలపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నప్పుడు, వారి అధినేత జగన్ “మా మీద ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి… ఎంతమందిని జైల్లో వేస్తారో వేసుకోండి. ఈ కేసులకు, జైళ్ళకు మేము భయపడం. మళ్ళీ మేము అధికారంలోకి వచ్చే వరకు పోరాడుతూనే ఉంటాము,” అని ప్రగల్భాలు పలికారు.
కానీ పోలీసులు కేసు నమోదు చేయగానే జోగి రమేష్ వంటి వైసీపి నేతలు ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టు చుట్టూ తిరుగుతున్నారు.
జగన్ మెప్పు కోసమే ఆయన చంద్రబాబు నాయుడు నివాసంపై దాడి చేసినప్పటికీ, ఈ కష్టకాలంలో జోగి అండ్ సన్స్‌ని జగన్ ఆదుకోవడం లేదు. కానీ పోలీసులు అరెస్ట్ చేసి వారిని జైల్లో పెడితే తప్పకుండా వచ్చి పరామర్శిస్తారు.




