కాంగ్రెస్ నమ్మకానికి – బిఆర్ఎస్ ఆశకు రేపు తుది గడువు కానుంది. ఇరు పార్టీల మధ్య సాగిన జూబ్లీహిల్స్ ఉపఎన్నికల యుద్దానికి రేపు ఫలితం విడుదల కానుంది.
శుక్రవారం ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలట్ ఓట్ల లెక్కింపుతో మొదలవనున్న ఈ ప్రక్రియ 10 రౌండ్ల కౌంటింగ్ తో పూర్తి కానుంది. అయితే ఈ ఎన్నికల గెలుపు ఫలితం ఎలా ఉండబోతుంది అనేది బ్యాలట్ ఓట్ల లెక్కింపుతోనే అధికార – ప్రతిపక్షాలు ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంది.
అయితే ఇప్పటికే ఈ ఉపఎన్నికల ఫలితాలు అధికార కాంగ్రెస్ కు అనుకూలంగా ఉండబోతున్నట్టు పలు సర్వేలు చెప్పడం తో పాటుగా బిఆర్ఎస్ కూడా పరోక్షంగా తన ప్రకటనలతో రేవంత్ సర్కార్ గెలుపును ధ్రువీకరిస్తుంది.
ఈ ఉపఎన్నికల పోరులో బిఆర్ఎస్ నైతికంగా గెలిచింది అంటూ బిఆర్ఎస్ ఇస్తున్న ప్రకటనలు ఆ పార్టీ ఓటమిని సూచిస్తున్నాయి అంటూ రాజకీయ విశ్లేషణలు మొదలయ్యాయి.
అయితే ఇక్కడ బిఆర్ఎస్ గెలుపైన, ఓటమైన అది కేసీఆర్ ఛరిష్మాను, కేటీఆర్ నాయకత్వాన్ని, బిఆర్ఎస్ ఉనికిని ప్రతిభింబిస్తాయి.
సాధారణంగా ఉపఎన్నికల పోరు అనేది అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి, అయితే ఇక్కడ ఉపఎన్నికల సిట్టింగ్ స్థానం బిఆర్ఎస్ నాయకుడిది కావడంతో బిఆర్ఎస్ పార్టీకి ఈ ఎన్నిక అనేది అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది.
దీనితో కేటీఆర్ తన సర్వ శక్తులు ఒడ్డి ఈ యుద్ధంలో ఎట్టిపరిస్థితులలోనూ రేవంత్ పై తానూ పై చేయి సాధించాలని పట్టుబట్టారు. అందులో భాగంగానే ఈ ఉపఎన్నికల బరువు – బాధ్యత రెండు తన భుజాన వేసుకుని మరి పార్టీ అభ్యర్థి గెలుపు కోసం శ్రమించారు.
జూబ్లీహిల్స్ గెలుపు బిఆర్ఎస్ ను కవిత గండం నుంచి కూడా కాపాడగలదు. లేకుంటే కవిత అటు బిఆర్ఎస్ పైన ఆ పార్టీ అధినాయకత్వం పైన కూడా మరిన్ని విమర్శలు ఎక్కుపెట్టి గులాబీ కారు పరువును మరింతగా బజారున పెట్టగలదు.
ఇక అధికార కాంగ్రెస్ సైతం కేటీఆర్ నాయకత్వాన్ని ఎండగట్టే ప్రమాదం లేకపోలేదు. కేసీఆర్ లేని బిఆర్ఎస్ పరిస్థితి సిట్టింగ్ స్థానాన్ని కూడా దక్కించుకోలేకపోయింది అంటూ ప్రత్యర్థి పార్టీలు కేటీఆర్ ను టార్గెట్ చేసేందుకు సిద్ధమవుతారు. వీటన్నిటికీ కేటీఆర్ దగ్గరున్న ఒకేఒక్క సమాధానం బిఆర్ఎస్ గెలుపు. మరి అది సాధ్యమా.?
ఇప్పటి వరకు హైద్రాబాద్ సిటీ మొత్తం గులాబీ మయం, గులాబీ కారును దాటి సిటీ ఓటర్స్ ప్రత్యామ్నాయం చూడరు, అది కాకా రేవంత్ తెచ్చిన హైడ్రా, అది మిగిల్చిన విధ్వంశం బిఆర్ఎస్ ను భరింత బలపరిచింది అనే ‘ఆశ’లో ఉన్న బిఆర్ఎస్ కు,
తెలంగాణలో తెరాస పేరు మార్పుతోనే బిఆర్ఎస్ పనైపోయింది, గత పదేళ్ల కేసీఆర్, కేటీఆర్ అవినీతి అక్రమాలు, అరాచకాలు బిఆర్ఎస్ ను మరింత పతనం చేసాయి అనే ‘నమ్మకం’తో ఉన్న కాంగ్రెస్ కు ఈ ఉపఎన్నికల ఫలితాలు అసలు వాస్తవాన్ని ప్రతిభింబిస్తాయి.
మరి రేపు సూర్యోదయం తరువాత కాంగ్రెస్ ‘నమ్మకం’ గెలుస్తుందో – బిఆర్ఎస్ ‘ఆశ’కు జీవం వస్తుందో, రేవంత్ ‘ప్రణాళిక’ ఫలిస్తుందో లేక కేటీఆర్ ‘పట్టుదల’ నెగ్గుతుందో తెలియనుంది.




