పార్టీ ఫిరాయింపు నేతల పై స్పీకర్ అనర్హత వేటు వెయ్యాలి, వారు బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఉపఎన్నికల పోరుకి సిద్ధమవ్వాలి అంటూ నాడు పట్టుబట్టిన బిఆర్ఎస్ వాదనకు బిఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలు కాస్త వెనక్కి తగ్గారు.
మేము ఇంకా బిఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే చెలామణి అవుతున్నామని, తమకు రాజీనామా చేసే ఉద్దేశం లేదంటూ వాదించారు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే లు. అయితే అటువంటి వారందరికీ ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ఫలితం మంచి ఊతమిచ్చిందనే చెప్పాలి.
జూబ్లీహిల్స్ వంటి బిఆర్ఎస్ బలమున్న స్థానంలో సైతం, అందునా బిఆర్ఎస్ సిట్టింగ్ నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పాగా వెయ్యడంతో ఇక ఉప ఎన్నికలకు మేము సైతం సిద్ధమంటూ బిఆర్ఎస్ మాజీ సీనియర్ నాయకుడు కడియం శ్రీహరి, దానం నాగేందర్ ప్రకటించారు.
అయితే 10 మంది పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఈ నెల 23 లోగా తమ వివరణ సమర్పించాలంటూ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆదేశించగా తాజాగా ఘన్ పూర్ స్టేషన్ ఎమ్మెల్యే కడియం, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం ఇద్దరు తమకు ఇంకాస్త సమయం కావాలంటూ స్పీకర్ ను కోరగా అందుకు స్పీకర్ అంగీకరించినట్టు సమాచారం.
తన రాజీనామా పై ప్రతిపక్షాలు మంచి ఉత్సాహంగా ఉన్నాయని, వారి ఉత్సాహాన్ని ఉప ఎన్నికలలో గెలిచి నిరుత్సాహపరుస్తానంటూ కడియం ప్రకటించారు. అలాగే దానం కూడా కడియం బాటలోనే ఉపఎన్నికలకు తానూ సిద్ధమంటూ ప్రకటించి స్పీకర్ దే తుది నిర్ణయమంటూ బాల్ స్పీకర్ కోర్ట్ లో వేశారు.
అయితే వీరిద్దరి ధైర్యం వెనుక, ఉపఎన్నికల ప్రకటన వెనుక జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితం ఉందనేది సుస్పష్టం. ఆ ధైర్యమే వీరి తెగువకు నిదర్శనం అని చెప్పవచ్చు. అలాగే జూబ్లీహిల్స్ ఫలితం ఇచ్చిన కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడి మీద కార్యకర్త మీద ఉంటుందనేది గ్రహించాలి.






