మాచర్ల టిడిపి ఇన్‌ఛార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డిపై పోలీసులు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. కానీ ఆయన మాచర్లతో సహా పల్నాడు జిల్లాలోని టిడిపి కార్యకర్తలకు ధైర్యం చెపుతూ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
దానిలో ఆయన ఏమన్నారంటే, రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఫ్యాక్షన్ హత్యలు తగ్గిపోయాయని, కానీ టిడిపియే వాటిని ప్రోత్సహితోందని వైసీపీ నేతలు వాదిస్తున్నారు. కానీ ఈ మూడున్నరేళ్ళలో గురజాల, మాచర్ల నియోజకవర్గాలలోనే ఎంతమంది టిడిపి కార్యకర్తలు హత్య చేయబడ్డారో, ఎంతమందిని పోలీసులు తప్పుడు కేసులతో వేధిస్తున్నారో న్యాయవిచారణకి వైసీపీ సిద్దామేనా? పల్నాడు జిల్లాలో వైసీపీ వేధింపులు, హత్యలు, అరాచకాలు భరించలేక వందలాది మంది టిడిపి సానుభూతిపరులు, కార్యకర్తలు ప్రాణాలు అరచేత పట్టుకొని ఇతర ప్రాంతాలకి, రాష్ట్రాలకి వలసలు వెళ్ళిపోయారు. జిల్లాలో ఇటువంటి అరాచక పరిస్థితులు నెలకొన్నప్పటికీ మాచర్లలో టిడిపి కార్యకర్తలు ధైర్యంగా ముందుకు వచ్చి ఎంతో పౌరుషంతో వైసీపీ శ్రేణులను నిలువరిస్తున్నారు.
మొన్న మాచర్లలో వైసీపీ కార్యకర్తలు నాపైన, నా ఇంటిపై దాడులు చేస్తునప్పుడు, టిడిపి కార్యకర్తలు ఎంతో ధైర్యం, పౌరుషం ప్రదర్శిస్తూ వారిని అడ్డుకొనేందుకు గట్టిగా ప్రయత్నించారు. ముఖ్యంగా వైసీపీ గూండాలు నాపై దాడి చేసినప్పుడు టిడిపి కార్యకర్తలు నా ప్రాణాలు కాపాడేందుకు తమ ప్రాణాలు పణంగా పెట్టడం నేను ఈ జన్మలో మరిచిపోలేను. వారందరికీ పేరుపేరునా నేను ధన్యవాదాలు తెలుపుకొంటున్నాను.
మనపై ఎన్ని ఒత్తిళ్ళు వస్తునా కడవరకు ఇదేవిదంగా అందరూ కలిసికట్టుగా ఉంటూ వైసీపీని ఎదుర్కోవాలి. ఈ ప్రయత్నంలో మిమ్మలని పోలీసులు వేధించినా, తప్పుడు కేసులు పెట్టి జైలుకి పంపిస్తున్నా భయపడవద్దని మనవి చేస్తునాను. నిజానికి పల్నాడులో పుట్టిన ప్రతీ ఒక్కరూ వారి జీవితంలో ఒక్కసారైనా పోలీస్ స్టేషన్ గడపగడప తొక్కకుండా ఉండరు. కనుక ఎవరూ భయపడవద్దని మనవి చేస్తున్నాను. ఒకవేళ ఎక్కడైనా కార్యకర్తలని పోలీసులు వేధిస్తునట్లయితే తక్షణం ఆ విషయాన్ని పార్టీలో ఏర్పాటుచేయబోతున్న హెల్ప్ లైన్ నంబర్లకి తెలియజేస్తే, ఎంతఖార్చైనా సరే టిడిపి న్యాయవాదులని ఏర్పాటు చేసి వారి తరపున న్యాయపోరాటం చేస్తుంది. అలాగే బాధిత కుటుంబాలని ఆదుకొనేందుకు టిడిపి అధిష్టానం సిద్దంగా ఉంది.
కనుక పార్టీ కార్యకర్తలందరూ మనో ధైర్యం కోల్పోకుండా వైసీపీ నేతలతో పోరాడుతూనే ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను. కొన్ని అనివార్య కారణాల వలన ప్రస్తుతం మీకు నేను అందుబాటులో లేనప్పటికీ ఎవరికి ఏ సాయం అవసరమైనా, ఎటువంటి కష్టం వచ్చినా నన్ను సంప్రదించవచ్చు,” అని అన్నారు.



