ప్రాంతీయ రాజకీయాల నుంచి జాతీయ రాజకీయాలకు అంటూ తెరాస పార్టీ పేరును బిఆర్ఎస్ పార్టీగా మారుస్తూ కేసీఆర్ తీసుకున్న ఆ ఒక్క నిర్ణయం పార్టీని అధికారం నుంచి ప్రతిపక్షానికి తెచ్చిందనే భావనను తాజగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం వ్యక్తపరిచారు.
ఈ నెల 25 న కేసీఆర్ కుమార్తె కవిత తన కొత్త రాజకీయ పార్టీ పేరును ప్రకటిస్తానంటూ చెపుతూ ఆ పేరు తెరాస కావచ్చు అనేలా సంకేతాలు కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీలో చర్చనీయాంశాలుగా మారిపోయాయి.
ఒకవేళ కవిత అనుకున్నట్టుగా తన పార్టీ పేరును తెరాస గా ప్రకటిస్తే బిఆర్ఎస్ పార్టీకి రాజకీయంగా పెద్ద ఎదురుదెబ్బ ఎదురయినట్టే అవుతుంది. తెరాస పేరు తెలంగాణ ప్రజల మనసుకి అతిదగ్గరగా వినిపించే పేరు. కొన్ని దశాబ్దాల పాటు తెలంగాణ రాజకీయాలలో నానిన పేరు, అలాగే కొన్నేళ్ల పాటు తెలంగాణ రాజకీయాలను శాసించిన పేరు.
ఇప్పుడు అటువంటి బలమైన పేరుతో కవిత తన కొత్త రాజకీయ ప్రయాణం మొదలు పెడితే కవిత పార్టీకి ప్రజలలో గుర్తింపు తొందరగా లభిస్తుంది. ఇది బిఆర్ఎస్ రాజకీయ భవిష్యత్ కి అత్యంత ప్రమాదకరం. అందుచేతనే కేటీఆర్ పార్టీ పేరు మార్పు అంశాన్ని ఇప్పుడు తెరమీదకు తెచ్చి దాన్నీ చర్చలోకి తెచ్చారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అలాగే ఇన్నాళ్లు పట్టీపట్టనట్టున్న తన సోదరి కవిత రాజకీయం పట్ల కూడా స్పందించారు. కవిత కుటుంబసభ్యులను ఏడిపించేలా వ్యవహరిస్తున్నారని, తల్లితండ్రులను సంతోష పెట్టకపోయిన పర్వాలేదు కానీ తన చర్యలతో వారిని ఇలా బాధపెట్టడం సబబు కాదంటూ మీడియా చిట్ చాట్ లో పేర్కొన్నారు.
అలాగే పదేళ్ల పాలనలో తమకు, ప్రజలకు మధ్య దూరం పెరిగిన మాట వాస్తవమని, రాబోయే రోజులలో ఆ గ్యాప్ ని తగ్గించేందుకు 2027 లో ప్రజాసమస్యల పై పాదయాత్ర చేస్తానంటూ మరోమారు ప్రకటించారు కేటీఆర్. ఇక అటు టీడీపీ పార్టీ గురించి ఆ పార్టీ అధినేత చంద్రబాబు గురించి కూడా రాజకీయ పొగడ్తలు కురిపించారు
టీడీపీ పార్టీలో మంచి లక్షణాలున్నాయని, ఆ పార్టీ నాయకుడు నేరుగా ఇటు ప్రజలతో అటు పార్టీ కార్యకర్తలతో మమేకమవుతారని, బిఆర్ఎస్ పార్టీలో అది లోపించడంతోనే పార్టీ పతనానికి కారణామంటూ వాస్తవాలను అంగీకరించారు.
అలాగే జైలుకు వెళ్తేనే సీఎం అవుతారనేది ఒట్టి రాజకీయ భ్రమ మాత్రమే అని హత్యలు చేసి జైలుకెళ్లంతా దుర్మార్గులం కాము అంటూ కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు బిఆర్ఎస్ లో హాట్ టాపిక్ అయ్యాయి.
పార్టీ పేరు మార్పు పై తప్పు ఒప్పుకోవడం, టీడీపీ విధానాల పై ప్రశంసలు కురిపించడం, ఇన్నాళ్లు కవిత పై ఉన్న సైలెన్స్ కి బ్రేకులు వేయడం ఇలా కేటీఆర్ స్వరంలో వచ్చిన ఈ మార్పులు దేనికి సంకేతాలుగా మారబోతున్నాయి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.




