కర్ణుడికి కవచ కుండలాలు ఎలాగో కల్వకుంట్ల కుటుంబ సభ్యులకి అహంకారం అటువంటిది. కురుక్షేత్ర యుద్ధానికి ముందే కర్ణుడి కవచ కుండలాలను ఇంద్రుడు తీసుకుపోయి అతని చావుకి కారకుడయ్యాడు.
కానీ కల్వకుంట్ల కుటుంబం మాత్రం తమ కవచ కుండలాలతోనే శాసనసభ ఎన్నికలలో యుద్ధం చేసి ఓడిపోయారు. అయినా ఎవరూ నేటికీ తమ అహం మాత్రం వదులుకోలేదు. ఇందుకు రెండు తాజా ఉదాహరణలు కనిపిస్తున్నాయి.
నిన్న శాసనసభలో సిఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ వద్దకు వచ్చినప్పుడు అయన లేచి నిలబడి ప్రతినమస్కారం చేశారు. ఆయనతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ లేచి నిలబడ్డారు. కేటీఆర్ ఒక్కరే లేచి నిలబడలేదు.
కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీకి దూరమైనా ఆమె ‘కల్వకుంట్ల’ ట్యాగ్ వదులుకోలేదు. అలాగే దాంతో వచ్చిన అహాన్ని కూడా వదులుకోలేదు.
బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు కట్టప్ప వంటివారని ఏనాటికైనా ఆయన కేసీఆర్‌ని మోసం చేస్తారని, కేటీఆర్‌ని కూడా బయటకు పంపించేసి పార్టీని స్వాధీనం చేసుకుంటారని కల్వకుంట్ల కవిత పదేపదే ఆరోపిస్తూనే ఉన్నారు. అది వారి పార్టీ అంతర్గత విషయం కనుక ఇతరులకు అనవసరం.
కానీ ఆమె తాజా ఇంటర్వ్యూలో హరీష్ రావుని బీఆర్ఎస్ పార్టీలో అందరూ ‘తెలంగాణ చంద్రబాబు నాయుడు’ అంటారని అన్నారు.
ఆమె ఏ ఉద్దేశ్యంతో ఈవిధంగా మాట్లాడినప్పటికీ అది ఆమె అహంభావానికి అద్దం పడుతోంది. అంతేకాదు… ‘తన తండ్రి పార్టీని హరీష్ రావు నుంచి కాపాడుకోలేని అసమర్ధుడు’ అని కూడా చెప్పినట్లే భావించవచ్చు. హరీష్ రావు కుట్రలు చేస్తున్నా తండ్రికి అర్థం కావడం లేదని ఆమె అంటున్నారు. అంటే అర్థం ఏమిటి?
ఏదో వంకతో ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుని ఓ మాట ఆనందే బీఆర్ఎస్ నేతలకి, అదే డీఎన్ఏ కలిగిన కల్వకుంట్ల కవితకి తృప్తి కలగదు. అలా నోటికి వచ్చినట్లు వాగినందుకే ఆయన సైలంట్‌గా వారికి ‘రిటర్న్ గిఫ్ట్’ ఇచ్చేశారు. వారు కూడా దానిని అంతే నిశబ్దంగా స్వీకరించారు కూడా. అయినా కేసీఆర్‌తో సహా ఎవరి నోరు, తీరు మారలేదు.
బయటవారు కల్వకుంట్ల అహంభావాన్ని భరించలేకపోవడం సహజమే. కానీ కవిత అహంభావాన్ని ఆమె తండ్రి, అన్న కూడా భరించలేకనే ఆమెను నిజామాబాద్ గడప దాటకుండా కట్టడి చేసి ఉండొచ్చు కదా? కానీ ఆమె చెలరేగిపోవడంతో ఇక భరించలేక వారే ఆమెను పార్టీ నుంచి బయటకు గెంటేశారు కదా?.
ఆమె హరీష్ రావు గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న సమయంలోనే కేసీఆర్ అయనని శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడరుగా నియమించారు. అంటే కూతురు కంటే ఆయనే ముఖ్యం. తనకు, పార్టీకి ఆయన అవసరమే ఉంది అని కేసీఆర్ చెప్పకనే చెప్పినట్లే కదా?
కేసీఆర్ రెండేళ్ళు ఫామ్‌హౌసులో ఉండిపోయి పార్టీని కొడుకు కేటీఆర్‌కి అప్పగిస్తే ఆయన చేతులేత్తేశారు. కనుకనే కేసీఆర్ తప్పనిసరి పరిస్థితిలో బయటకు రావాల్సివచ్చిందని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.
ఒకవేళ కేసీఆర్ నిజంగానే పార్టీని నడిపించలేని పరిస్థితిలో ఉంటే బీఆర్ఎస్ పార్టీని, దానిపైనే ఆధారపడున్న లక్షల మంది కార్యకర్తలను కాపాడుకునేందుకు పార్టీని హరీష్ రావుకే అప్పగించినా ఆశ్చర్యం లేదు. అప్పుడు తమ ఇద్దరి పరిస్థితి ఏమిటని కవిత, కేటీఆరే ఆలోచించుకోవాలి.






