లిక్కర్ స్కామ్ కేసులో 5 నెలలుగా ఢిల్లీ తిహార్ జైల్లో ఉంటున్న కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితకు ఎట్టకేలకు నేడు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈరోజు ఆమెకు తప్పకుండా బెయిల్ లభిస్తుందనే ముందస్తు సమాచారం అందిందో లేక వస్తుందనే నమ్మకంతోనో ఆమె భర్త అనిల్, సోదరుడు కేటీఆర్, హరీష్ రావు ఓ డజను మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఢిల్లీ చేరుకున్నారు.
ఇరుపక్షాల వాదోపవాదాలు తర్వాత సుప్రీంకోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించడంతో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ముఖ్యంగా కేటీఆర్ కుటుంబం ఆనందంతో పొంగిపోతున్నారు. అయితే ఆమె బెయిల్ మంజూరు అయినందున కొన్ని ఆసక్తికరమైన అంశాలు, పరిణామాల గురించి తప్పక చెప్పుకోవలసి ఉంటుంది.
సుప్రీంకోర్టులో ఆమె తరపున వాదించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ, ఈ కేసులో సీబీఐ, ఈడీలు 493 మంది సాక్షులను విచారించాయి. అయినా కల్వకుంట్ల కవిత నేరం చేశారని ఎటువంటి సాక్ష్యాధారాలు చూపలేకపోయాయి. ఆమె నుంచి ఒక్క రూపాయి కూడా రికవరీ చేయలేదు. ఈ కేసులో మనీష్ సిసోడియాకి బెయిల్ ఇచ్చినందున కల్వకుంట్ల కవితకి కూడా అదే వర్తింపజెసి బెయిల్ మంజూరు చేయాలని వాదించారు.
ముకుల్ రోహత్గీ మొదటి నుంచి ఇదే వాదనలు వినిపిస్తున్నారు. అలాగే సీబీఐ, ఈడీలు కూడా ఒకే వాదనలు వినిపిస్తున్నాయి. నేడు సుప్రీంకోర్టు ముకుల్ రోహత్గీ వాదనలను మాత్రమే పరిగణనలోకి తీసుకొని ఆమెకు బెయిల్ మంజూరు చేసింది కనుక ‘ఆమె ఆణిముత్యం’ అని ధృవీకరించిన్నట్లే భావించవచ్చు.
ఇది బిఆర్ఎస్ పార్టీకి, ముఖ్యంగా కేసీఆర్‌కి చాలా ధైర్యం కలిగిస్తుందని వేరే చెప్పక్కరలేదు. ఇంతకాలం ఆమె కోసమే దిగులుతో ఫామ్‌హౌస్‌కి పరిమితమైన కేసీఆర్ ఇప్పుడు బోనులో నుంచి బయటపడిన సింహంలా కాంగ్రెస్ ప్రభుత్వంపై గర్జించడం ప్రారంభించవచ్చు.
ఆగస్ట్ నెలలో తెలంగాణలో అనూహ్యమైన రాజకీయ పరిణామాలు జరుగబోతున్నాయని కేసీఆర్ రెండు నెలల క్రితమే చెప్పారు. రేవంత్ రెడ్డి కూడా బిఆర్ఎస్, బీజేపీల మద్య డీల్ కుదిరిందని శాసనసభలోనే చెప్పారు. కనుక ఒకవేళ ఈ బెయిల్ కోసం బిఆర్ఎస్, బీజేపీల మద్య ఏదైనా ‘డీల్’ కుదిరి ఉండి ఉంటే, తెలంగాణలో రాజకీయాలు, రాజకీయ సమీకరణలు, బలాబలాలు అన్నీ మారవచ్చు. కనుక కల్వకుంట్ల కవిత బెయిల్… ఈ కేసుకే పరిమితమని అనుకోలేము.




