బిఆర్ఎస్ ముఖ్య నాయకుల టార్గెట్ గా కవిత తన రాజకీయ పావులను కదుపుతూ వస్తున్నారు. అందులో భాగంగానే కేసీఆర్ బంధువు, బిఆర్ఎస్ కి అత్యంత కీలక నేతలు అయిన హరీష్ రావు, సంతోష్ రావు లను తన మొదటి ఫ్రేమ్ లో పెట్టిన కవిత వారి పై అవినీతి ఆరోపణలు వేస్తూ బిఆర్ఎస్ పై పరోక్ష యుద్ధం చేస్తున్నారు.
ఇక ఇప్పుడు గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో భాగమైన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పై బాణం ఎక్కుపెట్టారు కవిత. జనం బాట కార్యక్రమంలో భాగంగా కవిత చేస్తున్న పర్యటనలో కొత్తపల్లిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన కవిత నిరంజన్ రెడ్డి తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రికి ఘాటుగా బదులిచ్చారు.
పుచ్చు వంకాయ, సచ్చు వంకాయ అంటూ తన పై అవమానకరమైన భాషతో హద్దులు దాటి నిరంజన్ రెడ్డి మాట్లాడుతున్నారని, ఇన్నాళ్లు తన వయసుకి గౌరవం ఇచ్చి ఊరుకున్నాను కానీ మరోసారి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే తాట తీస్తా అంటూ నిరంజన్ రెడ్డిని హెచ్చరించారు.
గత పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో వనపర్తి పెద్దగా అభివృద్ధి చెందలేదని, మంత్రిగా నిరంజన్ రెడ్డి అవినీతి స్థానికంగా బిఆర్ఎస్ ను కోలుకోని విధంగా దెబ్బ కొట్టిందంటూ, దాని ఫలితమే నిరంజన్ ఘోర ఓటమి అన్నారు.
అలాగే నిరంజన్ తన అవినీతితో మూడు, నాలుగు ఫామ్ హౌసులు కట్టుకున్నారు కానీ నియోజకవర్గ ప్రజలకు మాత్రం ఎటువంటి అభివృద్ధిని అందించలేకపోయారంటూ మండిపడ్డారు. నిరంజన్ రెడ్డి అవినీతి ఈ స్థాయిలో ఉన్నప్పటికీ పార్టీ అధినేత కేసీఆర్ కి ఈ విషయం తెలియదా.? లేక హరీష్ ఇటువంటి వాటిని కేసీఆర్ కంటికి కనిపించకుండా, చెవులకు వినిపించకుండా దాస్తున్నారా.?
హరీష్ రావు కి అత్యంత సన్నిహితుడు కావడమే కాంగ్రెస్ కూడా నిరంజన్ అవినీతి పై చర్యలకు వెనకాడుతుందా.? అంటూ మరోసారి నిరంజన్ రెడ్డి అవినీతి విమర్శల కోణం నుంచి కవిత హరీష్ ను టార్గెట్ చేస్తున్నారు. అయితే కవిత ఇలా ఒక్కో బిఆర్ఎస్ నాయకుడి పైనా ముఖ్యంగా గత ప్రభుత్వంలో భాగమైన మంత్రుల పైన అవినీతి ఆరోపణలు చేస్తూ పోతుంటే అది పరోక్షంగా కేసీఆర్ ను ఇరుకున పెట్టినట్టే, బిఆర్ఎస్ ను ఇబ్బందులలో నెట్టినట్టే అవుతుంది.
అయినా బిఆర్ఎస్ నుంచి కవిత కు బలమైన కౌంటర్ రాలేకపోతుంది. బిఆర్ఎస్ నాయకుల ఈ నిశ్శబ్దం కవిత స్వరంలో శబ్దాన్ని పెంచుతుంది అనే విషయాన్ని బిఆర్ఎస్ గ్రహించలేకపోతుందా.? ఇలా వరుస పెట్టి హరీష్, సంతోష్, నిరంజన్ అంటూ మొదలు పెట్టిన కవిత చిట్టా ఏదోఒక కేటీఆర్ ను తాకదు, కేసీఆర్ ను తగులుకోదు అనే గ్యారెంటీ ఉంటుందా.?






