కల్వకుంట్ల కవిత ‘తెలంగాణ ప్రజా జాగృతి’ పేరుతో కొత్త పార్టీ ఏర్పాటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. దీని గురించి విలేఖరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం చెపుతూ, “ప్రస్తుతం మా పార్టీ అజెండా రూపొందించుకుంటున్నాము. పార్టీ ప్రకటించినప్పుడే జెండా, అజెండా కూడా ప్రకటిస్తాను. అయితే మా పోరాటం ప్రధానంగా డాడీ, మోడీ, చిన్న మోడీ (సిఎం రేవంత్ రెడ్డి)తోనే,” అని కవిత చెప్పారు.
బీఆర్ఎస్ పార్టీలో ఉన్నంతకాలం అందరూ ఆణిముత్యాలే… కేసీఆర్‌కి విధేయులే… క్రమశిక్షణతో పనిచేసే సైనికులే! కానీ ఏ కారణం చేత పార్టీ నుంచి బయటకు వచ్చినా ఆ క్షణం నుంచి వారు దుష్టులు, దుర్మార్గులు, తెలంగాణ ద్రోహులుగా ముద్రవేయబడతారు.
తెలంగాణ ఉద్యమాలలో కేసీఆర్‌తో భుజం భుజం కలిపి పోరాడిన ప్రొఫెసర్ కోదండరామ్ వంటివాఋ మొదలు ఈటల రాజేందర్ వరకు అందరిపై ఈ ముద్రలు పడ్డాయి. ఇప్పుడు కల్వకుంట్ల కవితపై పడితే ఆశ్చర్యం లేదు. కనుక నేటికీ డాడీని వెనకేసుకువస్తూ మాట్లాడుతున్న ఆమె ఇప్పుడు ‘డాడీ’తోనే పోరాడుతానని స్పష్టంగా చెప్పేశారు.
ఆమె ప్రాస కోసమే ‘డాడీ, మోడీ’ అన్నా కూడా బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగానే పరిగనిస్తుంది. ముఖ్యంగా ఆ పార్టీలో ఆమె వేలెత్తిచూపుతున్న హరీష్ రావు వర్గం ఆమెను ట్రోలింగ్ చేయక మానదు. ఒకవేళ చేయకున్నా, కేసీఆర్‌ని వ్యతిరేకిస్తున్నానని ఆమె బహిరంగంగా చెపితే ప్రజలే ఆమెను వ్యతిరేకించే ప్రమాదం ఉంటుంది.
కాంగ్రెస్, బిజేపి నేతలు కేసీఆర్‌ని వ్యతిరేకించడం వేరు… కేసీఆర్‌ని ఆయన నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీని కూతురు కల్వకుంట్ల కవిత వ్యతిరేకించడం వేరు. ఆమె తండ్రిపై రాజకీయంగా కత్తి దూయాలంటే పర్యవసానాల గురించి బాగా ఆలోచించాలి.
వాటి నుంచి తప్పించుకోవాలంటే కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, పార్టీ అవినీతి, అక్రమాలు, కుట్రలకు కేరాఫ్ అడ్రస్ అని గట్టిగా వాదించి నిరూపించాల్సి ఉంటుంది. కానీ ఆమె ఆ పని చేయలేనప్పుడు డాడీ, మోడీ అంటే భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తుంది కదా?




