గతంలో తెలంగాణలో రాజన్న రాజ్య స్థాపన చేస్తాం, చేసి తీరుతాం, నేను ఆడపిల్లను కాదు ఈడ పిల్లను అంటూ పాదయాత్రలు, పోరాట యాత్రలు చేసిన షర్మిల ను అప్పటి తెలంగాణ ప్రభుత్వం బిఆర్ఎస్ కనీసం పట్టించుకోను కూడా పట్టించుకోలేదు.
ఆమె బిఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కు పెట్టిన బాణాలు కానీ, ఆ పార్టీ అధినాయకత్వం పై చేసిన విమర్శలను కానీ బిఆర్ఎస్ లైట్ తీసుకుంది. కనీసం షర్మిల ఆరోపణల పై కౌంటర్ ఇచ్చేందుకు కూడా గులాబీ దండు ముందుకు రాలేదు.
అంటే తెలంగాణలో షర్మిల రాజకీయం కానీ, ఆమె పాత్ర కానీ ఎక్కడ వినిపించకూడదు, మరెక్కడా కనిపించకూడదు అనే పక్కా ప్రణాళికతో బిఆర్ఎస్ ముందుకెళ్లింది, సక్సస్ అయ్యింది కూడా. దాని ఫలితమే షర్మిల టి.వైసీపీ కాంగ్రెస్ లో విలీనంతో తనువు చాలించింది.
అయితే ఇప్పుడు బిఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ వేటుతో బయటకొచ్చిన కవిత విషయంలో కానీ, కవిత జాగృతి విషయంలో కూడా బిఆర్ఎస్ అదే స్ట్రాటజీ ని వినియోగిస్తూ కవిత బిఆర్ఎస్ ను ఆయా పార్టీల ముఖ్య నాయకులను ఎంతలా రెచ్చకొట్టినా, మరెంతలా విమర్శించినా బిఆర్ఎస్ నుంచి కవిత పై కానీ జాగృతి పై కానీ ఎదురుదాడి శూన్యమనే చెప్పాలి.
అయితే కవిత విషయంలో బిఆర్ఎస్ వ్యూహత్మకంగా మౌనం పాటించినప్పటికీ కాంగ్రెస్ మాత్రం కవిత పై ఇటు ప్రజలలో, అటు తెలంగాణ రాజకీయాలలో చర్చ జరిగేలా కవిత పై ఫోకస్ చేస్తుందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇందుకు తగ్గట్టే కవిత ‘జనం బాట’ కార్యక్రమంలో భాగంగా నల్గొండలో పర్యటించనున్నారు.
ఈ నేపథ్యంలో జాగృతి మద్దతుదారులు కవితకు స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా వాటన్నిటిని రాత్రికి రాత్రే మున్సిపల్ అధికారులు తొలగించారు. దీనితో కవిత ప్రభుత్వ పెద్దల నుంచి ప్రభుత్వ అధికారుల వరకు అందరి పై పెద్ద ఎత్తున విమర్శలు ఎక్కుపెట్టారు.
రేవంత్ సర్కార్ తన పై రాజకీయ కక్ష సాధిస్తుందని, అందుకు అధికారులు సహకరిస్తున్నారంటూ మండిపడ్డారు కవిత. దీనితో అప్పటి వరకు కవిత జనం బాట కార్యక్రమం పై లేని ప్రచారం ఒక్కసారిగా మీడియాలో దర్శనమిచ్చింది. ఇటువంటి ప్రచారాలు ఒక రకంగా బిఆర్ఎస్ ను దెబ్బ కొట్టేందుకు కాంగ్రెస్ కు ఆయుధాలుగా మారే అవకాశం ఉంది.
అలాగే తెలంగాణలో కవిత రాజకీయంగా బలపడితే అది బిఆర్ఎస్ ఓటింగ్ ను ప్రభావితం చేసే ప్రమాదం ఉంటుంది. తద్వారా కాంగ్రెస్ కు ఎంతోకొంత రాజకీయ లబ్ది చేకూరుతుంది. కవిత ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం తో పాటుగా అటు బిఆర్ఎస్ పై కూడా విమర్శలు ఎక్కుపెట్టగలరు.
కాబట్టి సొంత కుమార్తె కేసీఆర్ పార్టీని తిరస్కరిస్తోందని, ఇది కేటీఆర్ నాయకత్వ లోపానికి, కేసీఆర్ నియంతృత్వానికి అద్దం పడుతుంది అంటూ కాంగ్రెస్ అటు కేసీఆర్ ను ఇటు కేటీఆర్ ని టార్గెట్ చేసేందుకు వీలవుంటుంది. ఇది ఒక కోణమైతే,
అలాగే మరొకణంలో చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పై, ప్రభుత్వ పెద్దల పై కవిత చేసే విమర్శలను, ఆరోపణలను బిఆర్ఎస్ తో సరిపోల్చి బిఆర్ఎస్ – కవిత ఒకేతాను ముక్కలని, గత పదేళ్లు అధికారంలో ఉన్న కవిత ఏమి చెయ్యలేక ఇప్పుడొచ్చి రాజకీయ ప్రవచనాలు వల్లెవేస్తున్నారని ఇది కేవలం కల్వకుంట రాజకీయమే అంటూ కవిత తో పాటు బిఆర్ఎస్ ను కూడా ఇరుకున పెట్టొచ్చు.
ఇలా కవిత రాజకీయం పైనా, కవిత పై రాజకీయం చేసే విషయంలోను కాంగ్రెస్ ప్రభుత్వానికి రెండు వైపులా పదునే ఉంటుంది. అయితే ఆ పదును తన ప్రత్యర్థిని కాకుండా తనను టార్గెట్ చేస్తే మాత్రం రేవంత్ సర్కార్ ఇరుకునపడే ప్రమాదం లేకపోలేదు.




