కేసీఆర్.. అంటే ప్రాణాలు పణంగా పెట్టి పోరాడి తెలంగాణ సాధించిన వ్యక్తి. నభూతో నభవిష్యత్ అన్నట్లు తెలంగాణని పదేళ్ళలో అభివృద్ధి చేసిన ఘనుడు. రాజకీయ గురువు చంద్రబాబు నాయుడునే కేసులో ఇరికించి జైల్లో పెట్టేయాలనుకున్న మేధావి. తనకు భయపడి రాష్ట్రం నుంచి పారిపోయారని చెప్పుకొన్న గొప్ప ధీరుడు.
రాష్ట్రంలో ప్రతిపక్షాలను ఉక్కుపాదంతో అణచివేసి బీఆర్ఎస్ పార్టీని తిరుగులేని శక్తిగా నిల్పిన అపర చాణక్యుడు. 70-80 వేల పుస్తకాలు చదివిన ఏకైక మేదావి.
సమ్మె చేసిన ఆర్టీసీ కార్మికులతోనే తన చిత్ర పటాలకి పాలాభిషేకాలు చేయించుకున్న గొప్ప ముఖ్యమంత్రి. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా చాలానే ఉన్నాయి.
ఇలాంటి మేధావిని ‘ఒట్టి అమాయకుడు అందరినీ గుడ్డిగా నమ్మేసి మోసపోయాడు,’ అంటే నమ్మగలమా? అది ఆయన స్వయంగా మెడపట్టుకొని బయటకు గెంటేసిన ముద్దుల కూతురు కల్వకుంట్ల కవిత అంటే అసలే నమ్మగలమా?
కానీ తన తండ్రి ఒట్టి అమాయకుడని కవిత ఇవాళ్ళ మరో కొత్త కుండ బద్దలు కొట్టారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావు నేడు సిట్ విచారణకు హాజరయ్యారు.
ఆమె స్పందిస్తూ “ఉద్యమకారుడైన కేసీఆర్‌ని ఉద్యమకారులకు, పేద ప్రజలకు, అమరవీరులకు దూరం చేసింది ఈ దయ్యం సంతోష్ రావే. గద్దర్ వంటి మేధావులను ప్రగతి భవన్ గేటు బయట నిలబెట్టింది ఈ దెయ్యమే. ఈటల రాజేందర్ వంటి సీనియర్ నేతలను బయటకు గెంటించిందీ ఈ దయ్యమే.
ఈ దయ్యమే ఇప్పుడు ఫామ్‌హౌసులో సిఎం రేవంత్ రెడ్డి గూడచారిగా పనిచేస్తున్నాడు. కేసీఆర్ ఇడ్లీ తింటున్నారో లేదా పూరీ కూర తింటున్నారో ఎప్పటికప్పుడు రేవంత్ రెడ్డికి సమాచారం ఇస్తుంటుందీ ఈ గూడచారి దెయ్యం. కనుక ఈ కేసులో ఈ దెయ్యంపై ఈగ వాలకుండా రేవంత్ రెడ్డే చూసుకుంటారు.
కానీ నాకు ఒక్క విషయం అర్థం కాదు. పార్టీని నిలువునా ముంచేసి, తన పరువు ప్రతిష్టలని సర్వనాశనం చేసిన ఇలాంటి దెయ్యాలు సంతోష్ రావు, హరీష్ రావు వంటివారినే కేసీఆర్‌గారు ఇంకా ఎందుకు నమ్ముతున్నారో?” అని కల్వకుంట్ల కవిత అన్నారు.
కేసీఆర్ ఆమె చెప్పినంత అమాయకుడైతే ఇన్ని ఘన కార్యాలు ఎలా సాధించగలరు? కేసీఆర్ కేవలం అహంభావంతో, అధికారమదంతోనే ఉద్యమకారులను, అమరవీరులను, పేద ప్రజలను దూరం చేసుకున్నారని అందరికీ తెలుసు. ఫోన్ ట్యాపింగ్ కేసు, కాళేశ్వరం ప్రాజెక్ట్ క్రుంగిపోవడం కేసీఆర్ విశ్వరూపానికి రెండు సాక్ష్యాలే కదా?
ఫామ్‌హౌసులో నుంచి కాలు బయట పెట్టకుండానే నీళ్ళ పేరుతో ఆంధ్రా-తెలంగాణ మద్య మంటలు మండిస్తున్నారు కదా?నేటికీ చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ముడిపెట్టి ఇద్దరూ కలిసి తెలంగాణని దోచేసుకుంటున్నారంటూ తెలంగాణ సెంటిమెంట్ రాజేస్తూనే ఉన్నారు కదా?
ఫామ్‌హౌసులో నుంచి కాలు బయట పెట్టకుండా రాష్ట్ర రాజకీయాలనే కాకుండా ఏపీ రాజకీయాలను కూడా ప్రభావితం చేస్తున్న కేసీఆర్ నోట్లో వేలు పెడితే కొరకలేని అమాయకుడా? హరీష్ రావు, సంతోష్ రావులు మోసం చేస్తుంటే కనిపెట్టలేనంత అమాయకుడా కేసీఆర్?
ఓ కూతురుగా తండ్రి తప్పులు, పాపాలను ఇతరులపైకి నెట్టేసి వెనకేసుకువచ్చినా, ఆమెను నిర్దాక్షిణ్యంగా మెడ పట్టుకొని బయటకు గెంటేసింది ఆయనే కదా?అంటే ఆయన అమాయకుడా లేదా తన రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమనుకునే తెలివైన రాజకీయ నాయకుడా?






