చెడపకురా చెడేవు అని ఊరికే పెద్దలనలేదు. ఈ పెద్దలమాట వైసీపీ, బీఆర్ఎస్ పార్టీలకు సరిగ్గా వర్తిస్తుంది. తెలంగాణ ఏర్పడి, ముఖ్యమంత్రి అవడంతో కేసీఆర్ సంతృప్తి చెంది ఉంటే నేడు అయన పరిస్థితి వేరేగా ఉండేది.
కానీ ఉద్యమాలలో తనకు బాసటగా నిలిచినా ప్రొఫెసర్ కోదండరామ్, ఉద్యమకారులను, ఉస్మానియా విద్యార్ధులను, బలిదానాలు చేసుకున్నవారి కుటుంబాలను కేసీఆర్ బాధించారు.
తెలంగాణలో తన అధికారానికి, తన పార్టీకి ఎదురే ఉండకూడదని కాంగ్రెస్, టీడీపిలను నిర్వీర్యం చేశారు. అంతటితో ఆగకుండా రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడులను వెంటాడి వేధించారు. వారిని రాజకీయంగా సమాధి చేయాలని చూశారు. చివరికి ప్రధాని మోడీని, బిజేపిని, కాంగ్రెస్ పార్టీని చావు దెబ్బ తీయాలని ప్రయత్నించారు.
ఆర్టీసీ కార్మికులు జీతాలు పెంచమని సమ్మె చేస్తే వారితో చాలా నిర్దాక్షిణ్యంగా వ్యవహరించడం వలన సుమారు 39 మంది కార్మికులు చనిపోయారు. ప్రాజెక్టుల పేరుతో భూములు గుంజుకోవడంతో రైతులు రోడ్డున పడ్డారు.
ప్రాజెక్టుల పేరుతో వేలకోట్లు స్వాహా చేశారని ఘోష్ కమీషన్ తేల్చి చెప్పింది. ట్యాంక్ బంద్ వద్ద ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహం, సచివాలయం, దాని ఎదుట అమరజ్యోతి, సమీకృత కలెక్టర్ కార్యాలయాలు… ఇలా ప్రతీచోట కేసీఆర్ హయంలో భారీగా అవినీతి జరిగిందని ఆయన కుమార్తె కల్వకుంట్ల కవిత ఆరోపించారు.
కొడుకు కేటీఆర్‌ని ముఖ్యమంత్రి చేయాలనుకున్నారు. కానీ ఆయనకు అవకాశం లేకుండా చేసింది కూడా కేసీఆరే. కేంద్ర మంత్రి పదవి కావాల్సిన కూతురు కవితని పార్టీలో ఉన్నప్పుడే ఏకాకిగా చేసి, ఇప్పుడు పార్టీ నుంచి బహిష్కరించి రాజకీయంగా ఏకాకిగా చేశారు. ఆమె రాజకీయ జీవితం ప్రశ్నార్ధకంగా మార్చారు.
ఇంతమంది ఉసురు తగిలితే ఎన్ని వాస్తు మార్పులు చేసుకున్నా ఫలిస్తాయా? ఎన్ని ఎన్ని యాగాలు చేసినా దేవుళ్ళు కరుణిస్తారా? అని కేసీఆర్ ఒక్కసారి ఆలోచించి ఉంటే ప్రాయశ్చిత్తంగా రాజకీయాల నుంచి గౌరవంగా తప్పుకొని ఉండేవారు. కానీ ఆయనలో అహంకారం ఇంకా అలాగే ఉంది. అందుకే ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుని ఉద్దేశ్యించి చులకనగా మాట్లాడుతున్నారు. అంటే కర్మఫలం ఇంకా పూర్తిగా అనుభవించలేదేమో? అని సందేహం కలుగుతుంది.






