కేసీఆర్‌ కృష్ణమ్మను దాటి ఏపీలో అడుగుపెట్టగలరా?

KCR_BRS_Andhra_Pradeshతెలంగాణ సిఎం కేసీఆర్‌ ప్రధానమంత్రి కావాలనే తన కలను నెరవేర్చుకోవడానికి బిఆర్ఎస్‌ పార్టీతో జాతీయ రాజకీయాలలోకి ప్రవేశించారు. అయితే ప్రధాని నరేంద్రమోడీని గద్దె దించుతానని సవాలు చేస్తున్న, కేసీఆర్‌ తన సత్తా చాటుకొనేందుకు కర్ణాటక శాసనసభ ఎన్నికలలో పోటీ చేసే అవకాశం లభించినప్పటికీ చేయకపోవడంతో ఆయనవన్నీ ఉత్తరకుమార ప్రగల్భాలే అని ప్రజలు నవ్వుకొన్నారు.

ADVERTISEMENT

వచ్చే ఎన్నికలలో ఏపీలో 175/25 స్థానాలకు పోటీ చేస్తామని చెప్పుకొంటున్న బిఆర్ఎస్ పార్టీ, ఏపీలో అడుగుపెట్టేందుకు తటపటాయిస్తోంది. కారణాలు అందరికీ తెలిసినవే! అందుకే ఏ ఇబ్బందులు లేని మహారాష్ట్రవైపు సాగుతున్నారనుకోవచ్చు. అక్కడ బిఆర్ఎస్‌ పార్టీకి, కేసీఆర్‌కు జనాలు నీరాజనాలు పడుతున్నారని తెలంగాణ మంత్రులు ఎంత గొప్పగా చెప్పుకొంటున్నప్పటికీ, ఇంతవరకు మహారాష్ట్రలోని శివసేనతో సహా ఏ రాజకీయ పార్టీ కూడా కేసీఆర్‌తో కలిసి పనిచేసేందుకు ముందుకు రాలేదు! కేసీఆర్‌ అందించే ఆర్ధిక సాయానికి ఆశపడి కేవలం రైతుసంఘాల నాయకులు, అనామక రాజకీయనేతలు మాత్రమే హైదరాబాద్‌ వచ్చి బిఆర్ఎస్‌ కండువాలు కప్పుకొని వెళుతున్నారు. కనుక మహారాష్ట్ర ప్రజలు కేసీఆర్‌ని ఆదరిస్తారా లేదా?మహారాష్ట్రలో ఆయన వ్యూహాలు ఫలిస్తాయాలేదా అనేది ఎన్నికలొస్తే తెలుస్తుంది.

ఇప్పుడు మళ్ళీ ఏపీలో బిఆర్ఎస్‌ విషయానికి వస్తే, ఇప్పటికే ఏపీ ప్రయోజనాలకు భంగం కలిగించే అనేక అంశాలపై కేసీఆర్‌ సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. తాజాగా కృష్ణానదీ జలాలపై తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త పేచీ పెడుతోంది. అది కూడా ఏపీలో బిఆర్ఎస్ ప్రవేశానికి అడ్డుగోడగా నిలువబోతోంది.

2017లో రెండు తెలుగు రాష్ట్రాల మద్య జరిగిన ఒప్పందం ప్రకారం కృష్ణానదీ జలాలలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు 66:34 నిష్పత్తిలో పంచుకోవలసి ఉంటుంది. బచావత్ ట్రిబ్యూనల్ ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీల నీళ్ళు కేటాయించింది. నేటికీ ఆ ప్రకారమే నీళ్ళు వాడుకొంటున్నాయి. కానీ ఇటీవల జరిగిన కృష్ణా రివర్ బోర్డు మేనేజిమెంట్ సమావేశంలో ఏపీ, తెలంగాణలకు 50:50 చొప్పున నీటిని కేటాయించాలంటూ తెలంగాణ ప్రభుత్వం డిమాండ్‌ చేసింది. అంటే ఏపీ నీటి వాటలో 16 శాతం కోత విధించి తెలంగాణకు కేటాయించాలని కోరుతోందన్న మాట!

ఏపీకి ఎగువన తెలంగాణ రాష్ట్రం ఉండటంతో కృష్ణాగోదావరి నదులు తెలంగాణ మీదుగా ప్రవహించి ఏపీకి వస్తాయి. కనుక కేసీఆర్‌ ప్రభుత్వం ఈ వెసులుబాటును ఉపయోగించుకొంటూ తెలంగాణలో రెండు నదులపై అనేక సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు. ఆ కారణంగా, దిగువన ఉన్న ఏపీకి తీవ్రంగా నష్టపోతోంది. నేటికీ రాయలసీమ జిల్లాలలో ప్రజలు తాగునీటికి కూడా ఎంత ఇబ్బందిపడుతున్నారో అందరికీ తెలుసు. ఇది తెలిసి కూడా కేసీఆర్‌ కృష్ణా జలాలలో ఏపీ నీటివాటాలో కోత విధించి ఆ నీటిని తెలంగాణకు మళ్ళించుకోవాలని భావిస్తున్నారు.

ఏపీకి నష్టం కలిగినా తెలంగాణ లాభపడాలని కోరుకొంటున్న కేసీఆర్‌ కృష్ణమ్మను దాటి ఏపీలో అడుగుపెట్టగలరు?ఒకవేళ మాటకారితనంతో ఈ పేచీలను సమర్ధించుకొంటూ అడుగుపెట్టినా ఆంధ్రా ప్రజలు కేసీఆర్‌ను ఆదరిస్తారా? దేశనైకి ప్రధానమంత్రి కావాలని తహతహలాడుతున్న కేసీఆర్‌, ఓ ప్రాంతీయ నాయకుడిలాగే వ్యవహరిస్తున్నారు తప్ప జాతీయ దృక్పదంతో వ్యవహరించలేకపోతున్నారు. ఇప్పుడే నీళ్ళు, ఆస్తులు, అప్పులు, ఉద్యోగాల పంపకాలలో ఇన్ని పేచీలు పెడుతున్న కేసీఆర్‌ ఒకవేళ ప్రధానమంత్రి అయితే ఏపీ పరిస్థితి ఏమవుతుంది?ఆలోచించాల్సిందే!

ADVERTISEMENT
Latest Stories