ఢిల్లీలో బిఆర్ఎస్‌ జెండా.. హైదరాబాద్‌లో నిరసనలు

KCR BRS Delhiతెలంగాణ సిఎం కేసీఆర్‌ ఈరోజు మధ్యాహ్నం ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో భారత్‌ రాష్ట్ర సమితి (బిఆర్ఎస్‌) జెండా ఎగురవేసి జాతీయ రాజకీయాలలో ప్రవేశించారు. మోడీ ప్రభుత్వం ఓ అసమర్ధ ప్రభుత్వమని, అది చాలా అప్రజాస్వామికంగా, నిరంకుశంగా వ్యవహరిస్తోందని కేసీఆర్‌ వాదిస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రాన్ని ప్రశ్నించే వారిపైకి ఈడీ, సీబీఐ, ఐ‌టిలను ఉసిగొల్పి వేధిస్తున్నారని కేసీఆర్‌ వాదిస్తున్నారు. కనుక ఈ నిరంకుశ, అప్రజాస్వామిక మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించి కేంద్రంలో ప్రజాస్వామ్యయుతమైన, సమర్ధమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకే తాను జాతీయ రాజకీయాలలో ప్రవేశిస్తున్నానని చెప్పుకొంటున్నారు.

అయితే మోడీ ప్రభుత్వంలో ఆయన ఏ తప్పులు వేలెత్తి చూపుతున్నారో సరిగ్గా అవే ఆయన కూడా చేస్తున్నారని అందరికీ తెలుసు. గత 8 ఏళ్ళుగా తెలంగాణలో ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసి, గొంతెత్తి మాట్లాడనీయకుండా కర్కశకంగా అణచివేస్తూ రాష్ట్రంలో తన మాటకి, పార్టీకి, ప్రభుత్వానికి ఎదురే లేకుండా చేసుకొన్నారు. కేంద్రాన్ని ప్రశ్నిస్తే ఈడీ, సీబీఐ, ఐ‌టిలతో దాడులు చేయిస్తోందని వాదిస్తున్న కేసీఆర్‌ మంగళవారం సాయంత్రం తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులను హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్‌పైకి పంపించారు. వారు కాంగ్రెస్‌ కార్యాలయంలో జొరబడి అనేక కంప్యూటర్లను, కాంగ్రెస్‌ ఎంతో కష్టపడి సేకరించిన వాటిలోని విలువైన డేటాను పట్టుకుపోయారు.

ADVERTISEMENT

తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారనే ఆరోపణతో ఆ పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలుని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నేడు హైదరాబాద్‌తో సహా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌ శ్రేణులురోద్లెక్కి కేసీఆర్‌ దిష్టిబొమ్మలని ధగ్దం చేస్తూ నిరసనలు తెలియజేస్తున్నాయి. అక్కడ ఢిల్లీలో కేసీఆర్‌ బిఆర్ఎస్‌ జెండా ఎగురవేస్తున్న సమయంలోనే హైదరాబాద్‌లో ఆయన క్యాంప్ కార్యాలయం ప్రగతి భవన్‌ ముట్టడికి రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు ప్రయత్నించగా పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కి తరలించారు.

రాష్ట్రంలో ఈవిదంగా ప్రతిపక్ష పార్టీలని అణచివేస్తూ, దేశంలో ప్రతిపక్షాలు తన నాయకత్వాన్ని అంగీకరించి తనకు అండగా నిలబడాలని కేసీఆర్‌ కోరుకొంటున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఈవిదంగా ఖూనీ చేస్తూ దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఉద్దరిస్తానని కేసీఆర్‌ హామీ ఇస్తుండటం ఇంకా విడ్డూరంగా ఉంది.

పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంతో గత 8 ఏళ్ళుగా నిత్యం కయ్యమాడుతున్న కేసీఆర్‌ యావత్ దేశాన్ని ఏకం చేస్తానని చెపుతున్నారు. ఓ పక్క ఏపీ ప్రయోజనాలని దెబ్బ తీస్తూనే తాను జాతీయస్థాయి నాయకుడిగా ఎదిగేందుకు ఏపీ ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరుకొంటున్నారు!

రాష్ట్రంలో ప్రతిపక్షాలని అణచివేసిన వ్యక్తి రేపు ప్రధాని అయితే అప్పుడు దేశంలో ప్రతిపక్షాలని కూడా అణచివేయకుండా ఉంటారా? రాజ్యాంగం పట్ల గౌరవం లేని కేసీఆర్‌ రాజ్యాంగంకి కట్టుబడి ఉంటారా?తెలంగాణ సాధన కోసం తనతో కలిసి ఉద్యమాలు చేసిన ప్రొఫెసర్‌ కోదండరామ్‌నే తెలంగాణ ద్రోహిగా ముద్రవేసి ప్రజలకి దూరం చేసిన కేసీఆర్‌, ఇప్పుడు తనకు తోడ్పడుతున్నవారిని ప్రధాని అయితే ఏం చేస్తారో? అనే ప్రశ్నకు ఆయనకి మద్దతు పలుకుతున్న ప్రాంతీయ పార్టీలే ఆలోచించుకోవలసి ఉంటుంది.

ADVERTISEMENT
Latest Stories