సార్వత్రిక ఎన్నికల ఓటమితో బిఆర్ఎస్ ప్రతిపక్షానికి పరిమితం అవ్వడంతో పాటు ఆ పార్టీ అధినేత కేసీఆర్ ను అజ్ఞాతంలోకి నెట్టింది.
అయితే పదేళ్ల కేసీఆర్ నియంతృత్వం, దశాబ్ద కాలం పాటు సాగిన బిఆర్ఎస్ అధికారం తెలంగాణలో మరో రాజకీయ పార్టీకి చోటు లేకుండా చేయగలిగాయి, అలాగే మరో రాజకీయ నాయకుడిని ఎదగనివ్వకుండా అడ్డుకోగలిగాయి.
దానికి తోడు పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ అధికారంలోకి రావాలో, ఏ పార్టీ అధినేతకు ఓటమి అనే రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలో నిర్ణయించే స్థాయికి నిర్దేశించే స్థానానికి చేరుకున్నారు.
అయితే దాని కర్మ ఫలమే నేడు బిఆర్ఎస్ పార్టీ భుజాన మోస్తుందా.? లేక ఆ ప్రతిఫలాన్నే కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ గా తిరిగి అనుభవిస్తున్నారా.? అన్న చర్చలు జరుగుతున్నాయి.
నాడు అటు తెలంగాణ ఇటు ఏపీ రాజకీయాలను నిర్దేశించగలిగిన కేసీఆర్ నేడు కేవలం ఒక్క సిట్టింగ్ స్థానాన్ని కూడా తిరిగి పొందలేని స్థితికి వచ్చారా.? లేక తన అజ్ఞాతంతో పార్టీని ఆ పరిస్థితి లోకి నెట్టారా.?
నాడు ఎవరు ఏ పార్టీ తరుపున గెలిచినా చివరికి గులాబీ కారెక్కాల్సిందే, కేసీఆర్ కి మొక్కాల్సిందే అన్నట్టుగా రాజ్యమేలిన బిఆర్ఎస్, కేసీఆర్ చివరికి తన సొంత రక్తం తోనే నేడు రాజకీయ ఆరోపణలు ఎదుర్కుంటున్నారు, విమర్శల బాణాల గాయాలను భరిస్తున్నారు.
అలాగే నాడు రెండు కళ్ళ సిద్ధాంతాన్ని వెక్కింరించి హేళన చేసిన కేసీఆర్, తెరాస లలో ఒకరు తెరాస పేరు మార్పుతో తన అవతారాన్ని ముగించింది, మరొకరు కేసీఆర్ తన రెండు కళ్ళ (కేటీఆర్ – కవిత) ఆధిపత్య పోరుతో పార్టీలో, తెలంగాణ రాజకీయాలలో అంచలంచలుగా కనుమరుగవుతున్నారు.
ఇక నాడు తెలంగాణ టీడీపీ పార్టీని తెరాస లో విలీనం అంటూ ప్రకటించి టి.టీడీపీ ఆయువు తీసిన కేసీఆర్ ఇప్పుడు విలీన ప్రచారాలతో ఉనికి కోల్పోబోతున్న బిఆర్ఎస్ కు తిరిగి జీవం పోయలేని నిస్సహాయ స్థితిలో మూగవాడిగా మిగిలిపోయారు.
దాని ఫలితం ఉద్యమ పార్టీగా తెరాస, ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ ఇద్దరు ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో కనిపించకుండా పోయారు. ఒకరు పేరు మార్పుతో అవతారం చాలిస్తే మరొకరు నాయకత్వ మార్పు నిర్ణయంతో పక్కకు తప్పుకోవాలని భావిస్తున్నారు.
ఇదంతా పరిశీలిస్తే జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాల తరువాత కవిత చెప్పినట్టు “కర్మ హిట్స్ బ్యాక్” అనేది బిఆర్ఎస్ కా.? లేక కేసీఆర్ కా.? అన్న సందేహం రాకమానదు. అయితే ఇక్కడ కర్మ ఫలం ఎవరు అనుభవించినా దాని ఫలితం మాత్రం మొత్తం గులాబీ సైన్యానికి వర్తిస్తుంది అనేది వాస్తవం.






