వారిద్దరి అహం ఖరీదు… రెండు రాష్ట్రాలు, రెండు పార్టీలు!

kcr_jagan

ఒకరి ఆహానికి వారే నష్టపోతే ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ వారి ఆహానికి వారి పార్టీ, వారినే నమ్ముకున్న నేతలు, కార్యకర్తలు, చివరికి వారి రాష్ట్రం, ప్రజలు కూడా నష్టపోతేనే అందరూ వేలెత్తి చూపిస్తారు.

తెలంగాణలో కేసీఆర్‌, ఏపీలో జగన్‌ అహంభావం వలన ఇదే జరిగింది. కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం చాలా అభివృద్ధి జరిగింది కదా… మరి ఎలా నష్టపోయింది? అనే సందేహం కలుగవచ్చు.

ADVERTISEMENT

తెలంగాణ అభివృద్ధి చెందినమాట నిజం. అయితే ఆ పేరు కోసం కేసీఆర్‌ తీసుకున్న అనాలోచిత నిర్ణయాలను ఇప్పుడు రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఒకటొకటిగా బయటపెడుతుంటే కనపడని ఆ నష్టం లక్షల కోట్లుగా లెక్క తేలుతోంది.

ఛత్తీస్‌ఘడ్‌ ప్రభుత్వంతో చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందం, కాలం చెల్లిన టెక్నాలజీతో యాదాద్రి, భద్రాద్రి ధర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణం, మేడిగడ్డ బ్యారేజి పిల్లర్లు క్రుంగిపోవడం, ఆ కారణంగా బ్యారేజీలో నీళ్ళు నిలువచేయలేని పరిస్థితి, వంటి నిర్ణయాల వలన తెలంగాణ రాష్ట్రానికి కలిగిన నష్టం వేల కోట్లలోనే ఉంటుందని రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం లెక్కలు అప్పజెపుతోంది. కేసీఆర్‌ హయాంలో చేసిన అప్పులూ, వాటి వడ్డీల చెల్లిపులకే రోజుకి రూ.191 కోట్లు కట్టవలసి వస్తోందంటే పరిస్థితి అర్దం చేసుకోవచ్చు.

తెలంగాణని నభూతో నభవిష్యత్ అన్నట్లు తానే అభివృద్ధి చేశానని చూపించుకోవడానికి కేసీఆర్‌ తీసుకున్న అనాలోచిత లేదా తొందరపాటు నిర్ణయాల వలన తెలంగాణ రాష్ట్రానికి కనపడని ఇంత నష్టం జరిగిందని మెల్లగా బయటపడుతోంది.

ఇక కేసీఆర్‌ అహంభావం వలననే శాసనసభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీని ఓడగొట్టుకున్నారని ప్రతీ ఒక్కరూ అనుకుంటున్నదే.

జగన్‌ పాలనలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఎంతగా నష్టపోయిందో అందరికీ తెలుసు. జగన్‌ చేసిన అప్పులు రాష్ట్రాన్ని ఆర్ధికంగా దివాళా తీయించేస్తే, అమరావతి, పోలవరానికి చేసిన నష్టం అంతా ఇంతా కాదు.

అవివేకం లేదా అజ్ఞానం వలన జగన్‌ తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారని సర్ధి చెప్పుకోవడానికి కూడా లేదు. ఎందువల్ల అంటే నేటికీ “నేను రాష్ట్రానికి చాలా మేలు చేశాననే” జగన్‌ చెప్పుకుంటున్నారు కనుక.

ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత కూడా తన నిర్ణయాలు, విధానాలు అన్నీ సరైనవే అని సమర్ధించుకుంటున్నారు కనుక వాటి వలన కలిగిన నష్టానికి ఆయనే పూర్తి బాధ్యుడవుతారు.

తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అన్నట్లు జగన్‌ ఇంత అహంభావంతో వ్యవహరించడం వలననే ఎన్నికలలో వైసీపి ఘోర పరాజయం పాలయ్యింది.

అయినా ఇద్దరు నేతలకి కనువిప్పు కలుగకపోవడానికి కారణం వారి అహం అడ్డొస్తుంటమే అని అనుకోవచ్చు.

కనుక ఇక్కడ జగన్, అక్కడ కేసీఆర్‌ ఇద్దరూ తమ ఆహానికి తమ పార్టీలను, నమ్ముకున్న నేతలు, కార్యకర్తలను చివరికి రాష్ట్రాలను నష్టపరుచుకోవడానికి వెనకడలేదని భావించవచ్చు.

కానీ ఒకరి ఆహానికి సామాన్య ప్రజలు ఎందుకు మూల్యం చెల్లించాలి?అంటే రష్యా, చైనా, ఉత్తరకొరియా, ఇజ్రాయెల్, పాకిస్తాన్ దేశాధినేతల ఆహానికి ఆ దేశ ప్రజలతో పాటు ఇరుగు పొరుగు దేశాల ప్రజలు మూల్యం చెల్లించక తప్పడం లేదు కదా?

అదేవిదంగా జగన్, కేసీఆర్‌ల ఆహానికి ఏపీ, తెలంగాణ ప్రజలు కూడా మూల్యం చెల్లించుకోవలసి వస్తోందనుకోవచ్చు కానీ రెండు రాష్ట్రాల ప్రజలు ఎన్నికలలో ఆ తప్పుని సరిదిద్దారు కనుక ఇకనైనా రెండు రాష్ట్రాలు గాడిన పడతాయని ఆశిద్దాం.

ADVERTISEMENT
Latest Stories