‘కేసీఆర్ కనిపించుట లేదు’ అని ప్రకటనలు ఇచ్చే స్థాయికి కేసీఆర్ రాజకీయ నిశబ్దాన్ని పాటిస్తున్నారు. తెలంగాణలో కురిసిన వర్ష బీభత్సానికి అటు హైద్రాబాద్ వాసులు, ఇటు ఖమ్మం ప్రజలు వరదలతో అల్లాడుతున్నారు. అయినా కేసీఆర్ జాడ ఎక్కడ కనిపించలేదు, వినిపించలేదు.
దీనితో కేసీఆర్ మీద పెద్ద ఎత్తున విమర్శలు ఊపందుకున్నాయి. పదవి ఉంటేనేనా.? అధికారం తనదైతేనేనా.? అంటూ ఒక పక్క అధికార పార్టీ నేతలు ప్రశ్నింస్తుంటే, గెలిస్తేనేనా రాష్ట్రం, ఓడితే కనీసం కష్టాలలో ఉన్న ప్రజలను పరామర్శించడానికి కూడా బయటకు రారా.? అంటూ మరో పక్క బాధిత కుటుంబాలు కేసీఆర్ తీరును తప్పుబడుతున్నారు.
అయితే ఇన్నాళ్ళుగా కూతురు కవిత అరెస్టవు నేపథ్యంలో కేసీఆర్ మౌనం వహిస్తున్నారు ఇప్పుడు ఆ సమస్యకు బైలు రూపంలో పరిష్కారం దొరికింది, కావున ఇక కేసీఆర్ రాజకీయాలలో తన వేగం పెంచుతూ ప్రతిపక్ష నేతగా ప్రజల గొంతును అధికార పక్షానికి గట్టిగా వినిపిస్తారు అనుకున్న వారికి సైతం కేసీఆర్ తన మౌనంతో మరో సారి షాక్ ఇచ్చారనే చెప్పాలి.
అయితే ఎట్టకేలకు కేసీఆర్ కు సంబంధించిన ఒక వార్త బాహ్యప్రపంచానికి అందుబాటులోకి వచ్చింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఎర్రబెల్లి ఫేమ్ హౌస్ లో ‘నవగ్రహ’ మహా యాగం నిర్వహిస్తున్నారు అనే వార్త బయటకొచ్చింది. వేద పండితుల నడుమ తన సతీమణి శోభతో కలిసి కేసీఆర్ ఈ యాగం మొదలు పెట్టనున్నారు.
అయితే తీహార్ జైలు నుండి బైలు మీద బయటకు వచ్చి కవిత కూడా ఈ యాగంలో పాల్గొంటునట్లు సమాచారం. ఆధ్యాత్మిక భావనలో ఎక్కువగా గడిపే కేసీఆర్ 2015 లో ఛండీ యాగం, 2018, 2023 లో రాజశ్యామల యాగం నిర్వహించారు. అయితే 2023 ఎన్నికల ముందు నిర్వహించిన రాజశ్యామల యాగంతో కేసీఆర్ కు రాజ్యాధికారం దక్కలేదు.
దానికి తోడు అటు కేసీఆర్ కుటుంబానికి ఇటు బిఆర్ఎస్ పార్టీకి ఎన్నికల ఫలితాల నుంచి అన్ని అవాంతరాలే ఎదురయ్యాయి. పార్టీ ఓటమితో కృంగిన కేసీఆర్ కాలుకు ఫ్రాక్చర్ అవడం, కూతురు కవిత అరెస్టయ్యి జైలుకు వెళ్లడం, పార్టీ నేతలందరూ ఒక్కొక్కరుగా గులాబీ కండువాలు మార్చడం ఇలా అన్ని అపశకునాలే ఎదురవడంతో ఈ నవగ్రహ శాంతి పూజకు సిద్ధమయ్యారు కేసీఆర్.
ఈ పూజతో అయినా తనకు కాలం కలిసి వచ్చి మునుపటి మంచి రోజులు మళ్ళీ తిరిగి వస్తాయనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ నెల 11 నుంచి కేసీఆర్ తన ఫేమ్ హౌస్ “వనవాసాన్ని” వీడి ప్రజలలోకి వెళ్ళడానికి కార్యచరణను పార్టీ నేతలు సిద్ధం చేస్తున్నట్లు వార్తలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో జాతక రీత్యా తనకు ఉన్న అవరోధాలను తొలగించుకోవడానికి శాంతి పూజలను, యాగాలను నిర్వహిస్తున్నారు కేసీఆర్.
రాజశ్యామల యాగంతో ‘ముఖ్యమంత్రి’గా పదవి బాధ్యతలు తీసుకోవాలని ఆశించిన కేసీఆర్, ఇప్పుడు ఈ నవగ్రహ మహాయాగంతో ‘ప్రతిపక్ష నేత’గా బాధ్యతలు అందుకోవడానికి సిద్దమయ్యారన్న మాట..! చూడాలి మరి ఈ నవగ్రహాలు కేసీఆర్ కు బిఆర్ఎస్ పార్టీకి ఏ మేరకు మేలు చేస్తాయో అన్నది.




