మేము ఆణిముత్యాలం… అధికారంలో ఉన్నప్పుడు ఎటువంటి అవినీతి, అక్రమాలకు పాల్పడలేదని బల్ల గుద్ది వాదిస్తున్నప్పుడు, ధైర్యంగా విచారణకు హాజరయ్యి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. ఒకవేళ వారు ప్రభుత్వ ఒత్తిళ్ళకు తలొగ్గి అన్యాయం చేస్తున్నారనుకుంటే, నీతి నిజాయితీ నిరూపించుకునేందుకు న్యాయస్థానాలు ఉండనే ఉన్నాయి.
కానీ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు తమకు, కేసీఆర్‌కి నోటీస్ ఇవ్వడమంటే రాజకీయ కక్ష సాధింపే, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని టచ్ చేసినట్లే అంటూ బీఆర్ఎస్ నేతలు వాదించడం మొదలుపెట్టారు.
నాడు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కల్వకుంట్ల కవితకి ఈడీ నోటీస్ ఇచ్చినప్పుడూ ఇలాగే తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవం దెబ్బతీస్తున్నారంటూ వాదించారు.
కానీ అదే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆమెను బయటకు గెంటేశారు. ఆమె కూడా కేసీఆర్ హయంలో అవినీతి, అక్రమాలు, ఫోన్ ట్యాపింగ్ జరిగిన మాట వాస్తవం అని పదేపదే చెపుతున్నారు. అంటే పార్టీలో ఉన్నప్పుడు ఒకరి అవినీతిని మరొకరు దాచిపెట్టుకుంటారు. వేర్పడితే అవినీతి చిట్టాలు బయటపెట్టుకుంటారన్న మాట!
అలాగే ఇలాంటి కేసులలో చిక్కుకున్నప్పుడు దీనిని తెలంగాణ ప్రజలందరినీ కలిపేసుకొని వారిని రెచ్చగొట్టి రాజకీయాలు చేస్తూ ప్రజాభిప్రాయాన్ని, కుదిరితే విచారణాధికారుల, న్యాయ వ్యవస్థలను కూడా ప్రభావితం చేస్తుంటారన్న మాట!
కవిత మద్యం కేసులో జైలుకి వెళితే తెలంగాణ ఆడబిడ్డలకు ఏం సంబంధం? అలాంటి కేసులో ఆమె జైలుకి వెళితే ఆమె వల్ల యావత్ తెలంగాణకు అప్రదిష్ట కలిగిందని భావించాలి కదా? కానీ ఆత్మగౌరవం అంటే ఎలా?
అదేవిధంగా కేసీఆర్ హయంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కూతురు కవిత స్వయంగా చెపుతున్నప్పుడు, ఈ కేసులో కేసీఆర్‌కి సిట్ అధికారులు నోటీస్ ఇస్తే అది తప్పెలా అవుతుంది? ఆయన ఈ అక్రమాలకూ పాల్పడి ఉంటే దాంతో తెలంగాణ ప్రజలకు ఏం సంబంధం? ఆయన అవినీతికి పాల్పడి కేసులలో చిక్కుకుంటే ఆయన కోసం ప్రజలెందుకు ఆందోళన చెందాలి?
నిజానికి రాజకీయ పార్టీల పేరుతో మందబలం పెంచుకోవడం ద్వారానే వ్యవస్థలను, సమాజాన్ని దానిలో ప్రజలను చాలా ప్రభావితం చేయగలుగుతున్నారు. కానీ కేసులలో చిక్కుకున్నప్పుడు ఆ మందబలం సరిపోదు.
కనుక ప్రజలకు కూడా దీనిని ఆపాదించి వారి మద్దతు పొందాలనుకుంటున్నారు. అయితే మందబలంతో నందిని పంది అని నమ్మించవచ్చు కానీ అవినీతి మరకలు మాత్రం చెరుపుకోగలరా?
తెలంగాణ జాతి పిత, కోట్లాదిమంది ప్రజల ఆరాధ్యుడు గౌరవనీయులు కేసీఆర్ గారిపై రాజకీయ కక్షతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాగిస్తున్న కుతంత్రాలను తీవ్రంగా ఖండిస్తున్నాం.
కేసీఆర్ గారిని టచ్ చేయడం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేయడమే రేవంత్
స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసి, దశాబ్దకాలం…
— Harish Rao Thanneeru (@BRSHarish) January 29, 2026






